గడచిన ఏడాది అంటే 2023లో 59 వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం దక్కింది. తాజాగా ‘అమెరికా పౌరసత్వం- 2023’ నివేదిక విడుదలయ్యింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2023లో అమెరికా 59,000 మందికి పైగా భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది.
అమెరికా పౌరసత్వం పొందడంలో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. మెక్సికో మొదటి స్థానంలో ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో (సెప్టెంబర్ 30, 2023తో ముగిసే సంవత్సరం) సుమారు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు యూఎస్ పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షలకు మించిన మెక్సికన్లు, 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది.
యూఎస్ పౌరసత్వం మంజూరుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా వలస, జాతీయత చట్టం (ఐఎన్‌ఏ)లో నిర్దేశించిన నిర్దిష్ట అర్హతలకు అనుగుణంగా ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు చట్టబద్ధమైన శాశ్వత నివాసి (ఎల్‌పీఆర్)గా ఉండాలి. అలాగే అమెరికా పౌరులను జీవిత భాగస్వామిగా కలిగివుండడం, లేదా మిలటరీ సేవలో ఉండడంతో పాటు పలు సాధారణ నిబంధనలు పౌరసత్వాన్ని పొందేందుకు అర్హతలుగా ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2023లో అమెరికా పౌరసత్వం అందుకున్నవారిలో చాలా మంది ఐదేళ్ల చట్టబద్ద నివాసం ద్వారా అర్హత పొందినవారేనని నివేదిక వెల్లడించింది. అయితే అమెరికన్ పౌరులను పెళ్లి చేసుకున్నవారికి మూడేళ్ల వ్యవధికే అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment