ఏడాది తర్వాత దాపరికాలు బహిర్గతమవుతాయి. వారి అలవాట్లు బయటపడతాయి. ప్రేమికులు వాస్తవ ప్రపంచంలోకి వస్తారు. తమ పాత అలవాట్లు వెల్లడవుతాయి. దాంతో వారు ఇంతకు ముందు సహించిన విషయాలతో విభేదించడం ప్రారంభిస్తారు. ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తి ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒకటీ రెండు పుట్టిన రోజుల తర్వాత తన పట్ల ఉదారంగా లేరని గ్రహించి ప్రేమికులు బ్రేకప్‌లు చెప్పుకొంటున్నారు..
– డేవిడ్ మెక్‌క్యాండ్‌లెస్, సామాజిక శాస్త్రవేత్త
సాక్షి, అమరావతి: రోజ్– జాక్ ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉండేవారు. కాలేజీలో, బయట ఆ జంట గురించే చర్చ. ప్రేమికులంటే అలా ఉండాలని అందరూ చెప్పుకొనేవారు. ఏడాది గడిచింది. అదే జాక్– రోజ్.. జాక్ ఎదురుపడితే రోజ్ మొహం తిప్పుకొంటోంది. అతడూ తక్కువేం కాదు. ఆమెను చూడగానే గుడ్లురిమి చూస్తున్నాడు. ఒకరి కోసం ఒకరుగా ఉన్న జంట.. ఇప్పుడు ఉప్పు–నిప్పులా మారిపోయింది. ఎందుకిలా జరిగిందని అడిగితే ‘నిజం తెలిసింది’ అన్నది ఇద్దరి సమాధానం. యూఎస్, యూరప్ దేశాల్లోని ప్రేమ జంటల్లో 75 శాతం మొదటి సంవత్సరంలోనే విడిపోతున్నాయి.
20–25 శాతం మంది మాత్రం తమ ప్రేమను నాలుగైదేళ్ల పాటు కాపాడుకుంటున్నారు. పదేళ్ల పాటు కలిసున్న జంటలు చాలా అరుదు అని సామాజిక, మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నవారు ఒకటి లేదా రెండేళ్లలోనే ఎందుకు విడిపోతున్నారు? కారణాలేంటి? అన్న అంశాలపై స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సోషియాలజిస్ట్ మైఖేల్ రోసెన్‌ఫెల్డ్, మానసిక చికిత్స నిపుణుడు డాక్టర్ బార్టన్ గ్లాడ్‌స్మిత్‌లు వేర్వేరుగా సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. వీరు 2009 నుంచి 2022 వరకు దాదాపు 3000 జంటలపై చేసిన పరిశోధనల్లో విడిపోయేందుకు కీలకంగా మారిన అంశాలను గుర్తించారు.
మొదట్లో భాగస్వామి కోరుకున్నట్టుగా..
ప్రేమలో పడినప్పుడు తమ వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరూ చూపరు. తన భాగస్వామి ఏం చూడాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చూపిస్తారు. ఒక విధంగా ఇది ‘నటన’తో కూడి ఉంటుందని మైఖేల్ పేర్కొన్నారు. ‘ప్రేమ భావాలు మెదడులోని క్లిష్టమైన ఆలోచనలను నియంత్రిస్తాయి కాబట్టి.. మనం ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన లేదా వ్యక్తిత్వాన్ని లోతుగా అంచనా వేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రేమికుల మెదడు నిర్ణయిస్తుంది.
అందువల్ల తొలినాళ్లల్లో ప్రేమికుల వ్యక్తిత్వం వాస్తవానికి భిన్నంగా ఉంటుందంటున్నారు. ఏడాది గడిచాక దాచిపెట్టిన వ్యక్తిత్వం బయటపడుతుంది.. ఆ సమయంలోనే విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేమికుల రోజు, వసంతకాలం, ఏప్రిల్ ఫూల్స్ డే, వేసవి సెలవులు, క్రిస్మస్, క్రిస్మస్ రోజుకు రెండు వారాల ముందు, సోమవారాల్లో బ్రేకప్‌లు తరచుగా జరుగుతున్నాయని మరో సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ మెక్‌క్యాండ్‌లెస్ తేల్చారు.
5 నుంచి 10 శాతం జంటలే పెళ్లివరకూ..
ప్రేమపై భారతీయ యువతీ యువకుల అభిప్రాయాలు తెలు సుకునేందుకు సోషల్ నెట్‌వర్క్ యాప్ ‘బంబుల్’ సర్వే చేపట్టింది. దీనిప్రకారం వయసు, విద్య, సామాజిక నేపథ్యం, సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆరి్థక స్థిరత్వం వంటి అంశాలకు యువత అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది. వీటిని దాటుకుని ముందుకు సాగడం తమవల్ల కాదని 35 శాతం మంది యువకులు గర్ల్‌ఫ్రెండ్ అనే మాటకు దూరంగా ఉన్నారు. దాదాపు 50–55 శాతం మంది ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే ఉన్నామని వెల్లడించారు. ప్రేమించుకున్న జంటల్లో కేవలం 5 నుంచి 10 శాతం మాత్ర మే పెళ్లి వరకూ వెళుతున్నట్టు వెల్లడైంది.
దాచాలన్నా దాగవులే..
ప్రేమించిన తొలినాళ్లల్లో తమలో ఉన్న చెడు ప్రవర్తనలు దాచిపెట్టి ఎదుటి వారు కోరుకున్నట్టు ఉన్న వ్యక్తులు.. ఏడాది లోపే బయటపడిపోతున్నారట. పాత ప్రవర్తనలు ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం వంటివి ఎదుటి వారికి ఇబ్బందిగా మారడం.. వాటిని మానుకోమని చెప్పడంతో మొదలయ్యే ఘర్షణ బ్రేకప్‌కు దారితీస్తుందని గుర్తించారు.
ముఖ్యంగా చెడు ప్రవర్తనతో పాటు, మోసం, అధిక కోపం, ఎదుటివారికి అవసరంలో అండగా ఉండకపోవడం, చెడు సావాసాలు, భాగస్వామి పట్ల నిర్లక్ష్యం, అబద్ధాలు చెప్పడం, కష్టంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు వదిలేసి పోవడం, ఏదైనా విషయాన్ని సరిగా చెప్పకపోవడం వంటివి జంటల మధ్య
బీటలుగా మారుతున్నాయని తేల్చారు. వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా జంటల మధ్య మంట తప్పదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment