ఆఫ్ఘనిస్తాన్‌లోని బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. తాజాగా సంభవించిన ఈ వరదల కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని దండ్ ఎ ఘోరీ, దోషి, పుల్ ఎ ఖుమ్రీ, సెంట్రల్ బదక్షన్‌లోని మోర్చక్ తదితర ప్రాంతాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
గత వారంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్‌డబ్ల్యుఎఫ్‌పీ) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.
యూఎన్‌డబ్ల్యుఎఫ్‌పీ ట్విట్టర్‌లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, తమ సంస్థ ఉద్యోగులు బగ్లాన్‌కు అత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. బగ్లాన్ పోలీస్ కమాండ్ అధిపతి అబ్దుల్ గఫూర్ ఖాడెం మాట్లాడుతూ బగ్లాన్ రాష్ట్రంలోని దోషి జిల్లాలోని లర్ఖబ్ ప్రాంతంలో వర్షాల కారణంగా అత్యధిక నష్టం నమోదైందని చెప్పారు. లర్ఖబ్‌లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు మరణించారు. 500లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో ఒక కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు, మరో వ్యక్తి గాయపడ్డారని బదక్షన్ ప్రకృతి విపత్తు నిర్వహణ అధిపతి మహ్మద్ కమ్‌గర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment