![Afghanistan Government Is Ready to Surrender To Taliban - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/15/afgan.jpg.webp?itok=uR8tCVlb)
కాబూల్ : ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయినట్లు.. దేశాధ్యక్షుడు ఆశ్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్ బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో శాంతయుత చర్యల్లో భాగంగా ఘనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ప్రజలకు హాని తలపెట్టమని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్లు దురాక్రమణకు పాల్పడుతున్నారు. దేశంలో తాలిబన్ బలగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాత్రి జలాలాబాద్ నగరాన్ని ఆక్రమించాయి.
ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల దురాక్రమణపై ఐరాస సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని చెప్పారు. తాలిబన్లు దేశాన్ని స్వాధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘన్ నుంచి అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తోంది. కార్యాలయ సిబ్బందితో పాటే ఆఫ్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడు ఆశ్రఫ్ ఘనీ కూడా అమెరికా వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని స్వదేశానికి తిరిగి రావాలని ఇప్పటికే విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment