
ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి రోజుకో కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే వైద్య సిబ్బంది జీతాల్లేక ఇళ్లకే పరిమితం కాగా, జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు కరెన్సీ నిల్వలు లేక బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలై.. బ్యాంకులూ మూతపడ్డాయి. చాలా రంగాలు ఇదే బాట పడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా మీడియా రంగం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
ఆరు నెలలపాటు అఫ్గనిస్థాన్‌లో మీడియా ఛానెల్స్ ఏవీ పని చేయబోవని హెచ్చరికలు జారీ చేసింది అఫ్గనిస్థాన్ జర్నలిస్ట్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ ఫెడరేషన్. తక్షణమే మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించింది AJMOF. ఇందుకోసం వారం వ్యవధిని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టులో తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. చాలా రంగాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మీడియా ఆర్థికంతో పాటు సమాచార సేకరణలోనూ ఇబ్బందులు పడుతోంది.
‘‘చాలావరకు చానెళ్లు, పేపర్లు, వెబ్‌సైట్‌లు మూతపడ్డాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరుకున్నాం. కొందరు వేరే ఉద్యోగాలకు తరలిపోతున్నారు. కవరేజ్ సంగతి ఏమోగానీ.. జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి దాపురించింది’’ అని ఫెడరేషన్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తాలిబన్ ప్రభుత్వానికి సరైనరీతిలో స్పందించి ఉంటే.. ఇప్పుడు ఈ మీడియా రంగం సంక్షోభం ఎదుర్కొనేది కాదని ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది. నిధుల అవకతవకలతో పాటు కమ్యూనికేషన్ రంగం కుదేలు కావడానికి తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు జర్నలిస్టులు. పనిలో పనిగా ఈయూ మానవతా దృక్ఫథంతో అందించబోయే సాయం నుంచి తమకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment