సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై దేశాలు నిషేధం విధిస్తున్నాయి. బ్రిటన్ సరిహద్దులను పొరుగు దేశాలు మూసేశాయి. కోవిడ్ వైరస్ కొత్త రకం (స్ట్రెయిన్) బ్రిటన్‌లో విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. అదే బ్రిటన్‌లో వందేళ్ల కిందట కోరలు చాచిన ‘స్పానిష్ ఫ్లూ’ ఈ సందర్భంగా చరిత్రకారులు, శాస్త్రవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందింది కూడా బ్రిటన్‌లోనే అని చెబుతున్నారు.
ఇదీ కారణం..
మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు ముగిసిన కాలమది. యూరప్ నుంచి సైనికులు వారివారి దేశాలకు పయనమవుతున్నారు. లండన్‌కు 190 మైళ్ల దూరంలో ఉన్న పోర్ట్ సిటీ ప్‌లై మౌత్ నుంచి సైనిక నౌకలు బయల్దేరాయి. 1918 సెప్టెంబర్‌లో అమెరికాలోని బోస్టన్‌కు, ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్‌కు, పశ్చిమ ఆఫ్రికాలోని ఫ్రీటౌన్‌కు మూడు నౌకలు వెళ్లాయి. ఇక్కడి నుంచి వెళ్లిన సైనికులు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఇతర దేశాలకూ పాకింది. (చదవండి: కరోనా–2 కలకలం)
అమెరికాలో పుట్టి.. స్పెయిన్‌లో తీవ్రమై..
మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక.. 1918 మార్చిలో అమెరికాలోని కాన్సస్‌లో స్పానిష్ ఫ్లూ తొలి కేసు నమోదైంది. అక్కడి నుంచి సైన్యం యూరప్ వెళ్లగా.. అక్కడా ఈ లక్షణాలు ఎక్కువగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్పెయిన్ వెల్లడించటంతో ఫ్లూ లక్షణాలకు ‘స్పానిష్ ఫ్లూ’ అని పేరు పెట్టారు. యుద్ధం ముగిసిన తర్వాత యూరప్ నుంచి సైనికులు వారి వారి దేశాలకు స్పానిష్ ఫ్లూను తీసుకెళ్లారు. ఆ తర్వాత అది పూర్తి పరివర్తనతో విజృంభించింది. దాన్నే సెకండ్ వేవ్‌గా అప్పట్లో పేర్కొన్నారు. 1918 మార్చిలో తొలికేసు నమోదైన అమెరికాలో 189 మందే చనిపోయారు. కానీ.. యూరప్ నుంచి తిరిగి వచ్చిన సైనికులతో సెప్టెంబర్‌లో ప్రబలిన సెకండ్ వేవ్ మారణహోమాన్ని సృష్టించింది. ఒక్క అక్టోబర్‌లోనే అమెరికాలో 1.95 లక్షల మంది చనిపోయినట్లు నమోదైంది. (చదవండి: ‘బ్రిటన్’ జర్నీపై ప్రత్యేక నిఘా)
4 నెలల తర్వాత అసలు రూపం
యూరప్ నుంచి సైనికులతో జూన్‌లో ముంబైకి తొలి నౌక వచ్చింది. వారితోనే స్పానిష్ ఫ్లూ మన దేశంలో అడుగుపెట్టింది. ముంబైలో అదే ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఒక్కసారిగా వ్యాధి ప్రబలింది. బ్రిటన్ నుంచి బోస్టన్ వెళ్లిన సైనికుల్లో కనిపించిన లక్షణాలే మన దేశంలోనూ కనిపించాయి. అంటే.. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన వైరస్ మన దేశంలోకీ వచ్చిందన్నమాట. ఆ తర్వాత అక్టోబర్ మధ్యలో చెన్నైలో విజృంభించింది. నవంబర్‌లో కోల్‌కతాను అతలాకుతలం చేసింది. నెల రోజుల వ్యవధిలోనే దేశమంతా ప్రబలగా.. ఏకంగా కోటిన్నర మంది మృత్యువాత పడ్డారు.
కోవిడ్ అలా కాదు..
స్పానిష్ ఫ్లూ తరహాలోనే ప్రబలినా.. కోవిడ్ మాత్రం తొలి వేవ్‌లోనే విజృంభించింది. రెండో వేవ్‌తో పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా మనపై ఎంత ప్రభావం చూపుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. (చదవండి: కరోనా–2 కలకలం)
Comments
Please login to add a commentAdd a comment