టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు.
వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్‌డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్‌తోపాటు మరో 10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు.
అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్‌పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్‌లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment