helium
-
బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్‌డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్‌తోపాటు మరో 10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్‌పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. -
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలి... ఒకరు మృతి
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..బెలూన్లు అమ్మే వ్యక్తి నార్సింగ్ నిర్లక్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుడు 35 ఏళ్ల రవిగా గుర్తించారు. అతను బెలూన్లు కొనడానికి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురైదుగురు వ్యక్తుల స్వల్ప గాయాలతో బయటపడ్డారని అన్నారు. ఈ పేలుడులో ద్విచక్రవాహనాలు, ఒక ఆటోరిక్షా దారుణంగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ ఘటన మొత్తం టెక్స్టైల్ ఫోరూం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో షాపు బయట ఒక వ్యక్తి బెలూన్లు అమ్ముతున్నాడు. కాసేపటికి హఠాత్తుగా పేలుడు సంభవించింది తదనంతరం సమీపంలోని జనాలంతా భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. #WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ — ANI (@ANI) October 3, 2022 (చదవండి: పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె) -
భూమి పుట్టుకపై కొత్త ఆధారం
Origin Of The Earth: భూమి అంతర్భాగం (ఎర్త్ కోర్) నుంచి లీకవుతున్న హీలియం వాయువు, భూమి పుట్టుకపై కొత్త ఆధారాలనిస్తోంది. ఎర్త్ కోర్ నుంచి హీలియం3 వాయువు భారీగా లీకవుతున్నట్లు తాజాగా సైంటిస్టులు కనుగొన్నారు. ఈ వాయువు నక్షత్రాల పుట్టుకకు కారణమైన నెబ్యులాలో ఎక్కువగా కనిపిస్తుంది. నెబ్యులా (నక్షత్ర ధూళి)లో హైడ్రోజన్, హీలియం అధికంగా ఉంటాయి. ఇవి క్రమంగా స్వీయ ఆకర్షణకు గురై ధూళి, వాయువులుగా మారతాయి. అనంతరం ఆయా అణువుల మధ్య మరింత ఆకర్షణ పెరిగి ఘనపదార్థ్ధాలుగా మారతాయి. ఘనపదార్థ్ధం సైజు పెరిగే కొద్దీ దాని గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి) పెరుగుతుంది. మరి భూమి కూడా ఇలాగే ఏర్పడి ఉంటే వాతావరణంలో భారీగా హీలియం ఉండాల్సిఉంటుంది. అయితే 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక భారీ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టి ఉంటుందని, అప్పుడు భూవాతావరణంలో మరియు ఉపరితలంలో ఉన్న హీలియం అంతరిక్షంలోకి మాయమై ఉంటుందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఇప్పటికీ ప్రతిఏటా దాదాపు 2 కిలోల హీలియం3 వాయువు భూమి నుంచి లీకవుతోందని చెప్పారు. భూ లోపలి పొరల్లోని ఈ లీకేజీపై మరింత అధ్యయనం జరపాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సోలార్ నెబ్యులా నుంచి పుట్టుక భూ అంతర్భాగంలో హీలియం 3 వాయువు కనిపించడంతో భూమి సోలార్ నెబ్యులా నుంచి పుట్టిందనేందుకు బలమైన ఆధారంగా సైంటిస్టులు పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల క్రితం భూ ఆవిర్భావం జరిగింది. కానీ అది ఎలా జరిగిందనే విషయమై పలు అంచనాలున్నాయి. తాజా ఆధారంతో బిగ్‌బ్యాంగ్ అనంతరం సూర్యుడి పుట్టుక సందర్భంగా భూమి కూడా ఆవిర్భవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హీలియం3 వాయువు నిల్వలు ఇంకా భూమి అంతర్భాగంలో భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా పరిశోధన వివరాలను జర్నల్ ఏజీయూలో ప్రచురించారు. హీలియం3తో పాటు యురేనియం, థోరియం క్షీణతతో పలు మూలకాలు ఏర్పడి భూమి రూపుదిద్దుకొని ఉండొచ్చని పరిశోధనలో వెల్లడించారు. కేవలం ట్రిటియం అణువు రేడియోధార్మిక క్షీణత వల్ల మాత్రమే హీలియం 3 ఏర్పడుతుంది. నక్షత్ర ధూళిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి. (చదవండి: చర్చల్లో పురోగతి ) -
లేజర్ కిరణాలతో నక్షత్రాల శక్తి!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌లాగా కాలుష్యం గొడవ లేదు. అణు విద్యుత్తుతో వచ్చే రేడియోధార్మికత, వ్యర్థాల సమస్య ఉండదు. ఛర్నోబిల్, ఫుకుషిమా వంటి అణు ప్రమాదాలకూ ఆస్కారం లేదు. బయటకొచ్చేదంతా హాని చేయని హీలియం. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నేరుగా వాడుకోవడమే.. ఏమిటిదీ.. ఎలా సాధ్యం? ప్రపంచం మొత్తం దశాబ్దాలుగా పరిష్కరించేందుకు మల్లగుల్లాలు పడుతున్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని ‘హెచ్‌బీ11 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ఓ వినూత్నమైన పరిష్కారం కనుక్కుంది. వీరి ఆలోచన విజయవంతమైతే.. భూమ్మీద విద్యుత్తు కొరత అసలే ఉండదు. సూర్యుడితో పాటు నక్షత్రాలన్నింటిలోనూ శక్తి ఉత్పత్తి అయ్యేందుకు కారణమైన కేంద్రక సంలీన ప్రక్రియపై ఆ సంస్థ కన్నేసింది. కేంద్రక సంలీన ప్రక్రియ అంటే? అణు విద్యుత్ శక్తి ప్లాంట్ల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. ఇందులో అణువులను విడగొట్టడం ద్వారా పుట్టే వేడిని విద్యుత్తుగా మారుస్తారు. కేంద్రక సంలీన ప్రక్రియ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇందులో విపరీతమైన వేడిని ఉపయోగించి అణువులను ఒకదాంట్లో ఒకటి లయమయ్యేలా చేస్తారు. సూర్యుడు, ఇతర నక్షత్రాలన్నింటిలోనూ హైడ్రోజన్ హీలియం అణువులు లయమైపోవడం ద్వారానే శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ఈ శక్తిని మనం వెలుతురు రూపంలో అనుభవిస్తున్నాం. అయితే నక్షత్రాల్లో కోటాను కోట్ల ఏళ్లుగా జరుగుతున్న కేంద్రకసంలీన ప్రక్రియను భూమ్మీద సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. హైడ్రోజన్, హీలియం వంటి ఇంధనాలను లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా మాత్రమే ఆ రెండు అణువులు కలసిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి ఓ విద్యుదుత్పత్తి రియాక్టర్‌ను నిర్మించేందుకు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ పేరుతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్‌లో ప్రయత్నం చేస్తోంది. అణువులను లయం చేయడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యమైతే? ఆ తర్వాత ఈ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయాన్ని ఆలోచిస్తారు. హెచ్‌బీ11.. కాస్త డిఫరెంట్.. అయితే హెచ్‌బీ11 అభివృద్ధి చేసిన టెక్నాలజీలో ఇంధనాలను వేడి చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా శక్తిమంతమైన లేజర్లను ఉపయోగిస్తారు. అత్యంత సూక్ష్మ సమయం మాత్రమే వెలువడే ఈ లేజర్ల ద్వారా సూర్యుడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను పుట్టిస్తారు. ఈ టెక్నాలజీలో లోహంతో తయారు చేసిన ఓ బంతిలాంటి నిర్మాణం ఉంటుంది. దీని మధ్యభాగంలో హెచ్‌బీ11 గుళిక ఉంచుతారు. గుళికపై ఇరువైపులా చిన్న కణతలు ఉంటాయి. అయస్కాంత శక్తితో ఒక లేజర్ ప్లాస్మాను పట్టి ఉంచితే.. రెండో లేజర్ కేంద్రకసంలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో విడుదలయ్యే ఆల్ఫా కణాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్తును నేరుగా గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. ఈ పద్ధతిలో ఉపయోగించే బోరాన్ ప్రపంచవ్యాప్తంగా విరివిగా లభిస్తుందని, యురేనియం థోరియం వంటి అణు ఇంధనాల కంటే సులువుగా వెలికితీసి వాడుకోవచ్చని హెచ్‌బీ11 వ్యవస్థాపకుడు డాక్టర్ హెన్రిక్ హోరా చెబుతున్నారు. అణు రియాక్టర్లలోలా స్టీమ్ ఇంజన్లను ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషమంటున్నారు. అరవై ఏళ్ల ప్రస్థానం.. 1960: తొలి లేజర్ ఆవిష్కరణ 1960–78: లేజర్ల సాయంతో సంలీన ప్రక్రియపై ప్రొఫెసర్ హెన్రిక్ హోరా పరిశోధనలు 1978: శక్తిమంతమైన లేజర్లతో హైడ్రోజన్, బోరాన్ –11 (హెచ్‌బీ11)లను బాగా వేడి చేయకుండానే లయం చేయొచ్చని హెన్రిక్ హోరా ప్రకటన. 1985: అందుబాటులోకి చిర్ప్డ్ పల్స్ ఆంప్లిఫికేషన్ టెక్నాలజీ(సీపీఏ). డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న లేజర్ కిరణాల శక్తిని లక్షల రెట్లు పెంచేందుకు వీలేర్పడింది. 2005–2015: సీపీఏ టెక్నాలజీ సాయంతో హెచ్‌బీ11ను లయం చేయొచ్చని, ఇందుకు 2 పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయాల్సిన అవసరం లేదని పలువురు శాస్త్రవేత్తల నిరూపణ. 2014–2017: కేంద్రక సంలీన ప్రక్రియను సులువుగా సాధించే టెక్నాలజీపై పేటెంట్ హక్కులు నమోదు చేసిన హెచ్‌బీ11 2018: డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూలకు భౌతిక శాస్త్ర నోబెల్. 2019: హెచ్‌బీ11 ఎనర్జీ కంపెనీ ఏర్పాటు. తొలి అమెరికన్ పేటెంట్ మంజూరు! -
మిషన్ హీలియం–3
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో బృహత్తర మిషన్‌కు సిద్ధమైంది. చంద్రుడిపై అన్వేషణకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ చంద్రుడి మధ్యరేఖపై మాత్రమే జరిగాయి. చంద్రగోళంలోని దక్షిణ భాగంలోకి ఇంత వరకూ ఏ దేశం వెళ్లిన దాఖలా లేదు. జాబిల్లి దక్షిణ భాగంలో లక్షలాది కోట్ల విలువైన హీలియం–3 అనే ఇంధన వనరుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చేపట్టబోయే చంద్రయాన్–2 ప్రయోగాన్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇస్రో చంద్రుడి దక్షిణ భాగంలో ఒక రోవర్‌ను దించనుంది. ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించి హీలియం–3, నీటి జాడను అన్వేషిస్తుంది. భూమిపై పరిమితంగా లభ్యమయ్యే హీలియం–3 ఐసోటోప్ చంద్రుడిపై పుష్కలంగా ఉందని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రయాన్–1 ద్వారా చంద్రుడిపై నీటి పరమాణువులున్న విషయాన్ని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు చంద్రయాన్–2తో మరో అద్భుత విజయాన్ని అందుకోవాలనే ఆలోచనలో ఉంది. మూడు ప్రయోగాలతో సమానం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మూడు పరికరాలను ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. ఆర్బిటర్‌ను చంద్రుడి మధ్య కక్ష్యలో, ల్యాండర్, రోవర్‌ను దక్షిణ ధ్రువానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో దించుతారు. ఆరు చక్రాలతో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే రోవర్ హీలియం–3పై ప్రయోగాలు చేసి, ఆ సమాచారాన్ని అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కనీసం 14 రోజుల పాటు 400 మీటర్లు వ్యాసార్థం పరిధిలో పరిభ్రమిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది. రోవర్ నుంచి సమాచారం ఆర్బిటర్ ద్వారా మాస్టర్ కంట్రోల్ సెంటర్(భూకేంద్రం)కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క మిషన్ మూడు ప్రయోగాలకు సమానమని ఇస్రో పరిశోధకులు చెబుతున్నారు. -
'చంద్రుడి నుంచి భారత్‌కు శక్తి'
న్యూఢిల్లీ: చంద్ర మండలం నుంచి భారత అవసరాలకు శక్తిని తెచ్చుకునే వీలు కలుగుతుందని ఇస్రోకు చెందిన ఓ శాస్త్రవేత్త చెప్పారు. చంద్రునిపై అధికంగా లభ్యమయ్యే హీలియం-3 నుంచి భారత అవసరాలకు శక్తిని సమకూర్చుకోవచ్చని శివాంతను పిళ్లై వెల్లడించారు. ఓఆర్ఎఫ్-కల్పనా చావ్లా స్పేస్ పాలసీ కార్యక్రమంలో మాట్లాడుతూ 2030 కల్లా ఈ ప్రాసెస్ పూర్తి అవుతుందని తెలిపారు. మరొకొద్ది రోజుల్లో ప్రజలు చంద్రుడి మీదకు హనీమూన్‌కు వెళ్తారని అన్నారు. చంద్రుని మీద భూమిని తవ్వి హీలియం-3ని భూమికి తీసుకురావడం ఇస్రో లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. గతంలో పిళ్లై బ్రహ్మోస్ ఎరోస్పేస్ చీఫ్‌గా కూడా పనిచేశారు. మిగతా ప్రపంచదేశాలు కూడా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి సరిపడే హీలియం చంద్రుడిపై ఉందని చెప్పారు.