మిషన్‌ హీలియం–3 | India’s Second Moon Mission Targets Helium-3 | Sakshi
Sakshi News home page

మిషన్‌ హీలియం–3

Published Sun, Sep 9 2018 3:03 AM | Last Updated on Sun, Sep 9 2018 8:01 AM

India’s Second Moon Mission Targets Helium-3 - Sakshi

చంద్రయాన్‌–2 ఉపగ్రహం(ఫైల్‌)

సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో బృహత్తర మిషన్‌కు సిద్ధమైంది. చంద్రుడిపై అన్వేషణకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ చంద్రుడి మధ్యరేఖపై మాత్రమే జరిగాయి. చంద్రగోళంలోని దక్షిణ భాగంలోకి ఇంత వరకూ ఏ దేశం వెళ్లిన దాఖలా లేదు. జాబిల్లి దక్షిణ భాగంలో లక్షలాది కోట్ల విలువైన హీలియం–3 అనే ఇంధన వనరుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

ఇందుకోసం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చేపట్టబోయే చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇస్రో చంద్రుడి దక్షిణ భాగంలో ఒక రోవర్‌ను దించనుంది. ఈ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించి హీలియం–3, నీటి జాడను అన్వేషిస్తుంది. భూమిపై పరిమితంగా లభ్యమయ్యే హీలియం–3 ఐసోటోప్‌ చంద్రుడిపై పుష్కలంగా ఉందని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రయాన్‌–1 ద్వారా చంద్రుడిపై నీటి పరమాణువులున్న విషయాన్ని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు చంద్రయాన్‌–2తో మరో అద్భుత విజయాన్ని అందుకోవాలనే ఆలోచనలో ఉంది.

మూడు ప్రయోగాలతో సమానం..
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి చంద్రయాన్‌–2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10) ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మూడు పరికరాలను ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. ఆర్బిటర్‌ను చంద్రుడి మధ్య కక్ష్యలో, ల్యాండర్, రోవర్‌ను దక్షిణ ధ్రువానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో దించుతారు.

ఆరు చక్రాలతో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే రోవర్‌ హీలియం–3పై ప్రయోగాలు చేసి, ఆ సమాచారాన్ని అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కనీసం 14 రోజుల పాటు 400 మీటర్లు వ్యాసార్థం పరిధిలో పరిభ్రమిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది. రోవర్‌ నుంచి సమాచారం ఆర్బిటర్‌ ద్వారా మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌(భూకేంద్రం)కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క మిషన్‌ మూడు ప్రయోగాలకు సమానమని ఇస్రో పరిశోధకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement