సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌లాగా కాలుష్యం గొడవ లేదు. అణు విద్యుత్తుతో వచ్చే రేడియోధార్మికత, వ్యర్థాల సమస్య ఉండదు. ఛర్నోబిల్, ఫుకుషిమా వంటి అణు ప్రమాదాలకూ ఆస్కారం లేదు. బయటకొచ్చేదంతా హాని చేయని హీలియం. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నేరుగా వాడుకోవడమే.. ఏమిటిదీ.. ఎలా సాధ్యం? ప్రపంచం మొత్తం దశాబ్దాలుగా పరిష్కరించేందుకు మల్లగుల్లాలు పడుతున్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని ‘హెచ్‌బీ11 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ఓ వినూత్నమైన పరిష్కారం కనుక్కుంది. వీరి ఆలోచన విజయవంతమైతే.. భూమ్మీద విద్యుత్తు కొరత అసలే ఉండదు. సూర్యుడితో పాటు నక్షత్రాలన్నింటిలోనూ శక్తి ఉత్పత్తి అయ్యేందుకు కారణమైన కేంద్రక సంలీన ప్రక్రియపై ఆ సంస్థ కన్నేసింది.
కేంద్రక సంలీన ప్రక్రియ అంటే?
అణు విద్యుత్ శక్తి ప్లాంట్ల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. ఇందులో అణువులను విడగొట్టడం ద్వారా పుట్టే వేడిని విద్యుత్తుగా మారుస్తారు. కేంద్రక సంలీన ప్రక్రియ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇందులో విపరీతమైన వేడిని ఉపయోగించి అణువులను ఒకదాంట్లో ఒకటి లయమయ్యేలా చేస్తారు. సూర్యుడు, ఇతర నక్షత్రాలన్నింటిలోనూ హైడ్రోజన్ హీలియం అణువులు లయమైపోవడం ద్వారానే శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ఈ శక్తిని మనం వెలుతురు రూపంలో అనుభవిస్తున్నాం. అయితే నక్షత్రాల్లో కోటాను కోట్ల ఏళ్లుగా జరుగుతున్న కేంద్రకసంలీన ప్రక్రియను భూమ్మీద సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. హైడ్రోజన్, హీలియం వంటి ఇంధనాలను లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా మాత్రమే ఆ రెండు అణువులు కలసిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి ఓ విద్యుదుత్పత్తి రియాక్టర్‌ను నిర్మించేందుకు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ పేరుతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్‌లో ప్రయత్నం చేస్తోంది. అణువులను లయం చేయడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యమైతే? ఆ తర్వాత ఈ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయాన్ని ఆలోచిస్తారు.
హెచ్‌బీ11.. కాస్త డిఫరెంట్..
అయితే హెచ్‌బీ11 అభివృద్ధి చేసిన టెక్నాలజీలో ఇంధనాలను వేడి చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా శక్తిమంతమైన లేజర్లను ఉపయోగిస్తారు. అత్యంత సూక్ష్మ సమయం మాత్రమే వెలువడే ఈ లేజర్ల ద్వారా సూర్యుడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను పుట్టిస్తారు. ఈ టెక్నాలజీలో లోహంతో తయారు చేసిన ఓ బంతిలాంటి నిర్మాణం ఉంటుంది. దీని మధ్యభాగంలో హెచ్‌బీ11 గుళిక ఉంచుతారు. గుళికపై ఇరువైపులా చిన్న కణతలు ఉంటాయి. అయస్కాంత శక్తితో ఒక లేజర్ ప్లాస్మాను పట్టి ఉంచితే.. రెండో లేజర్ కేంద్రకసంలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో విడుదలయ్యే ఆల్ఫా కణాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్తును నేరుగా గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. ఈ పద్ధతిలో ఉపయోగించే బోరాన్ ప్రపంచవ్యాప్తంగా విరివిగా లభిస్తుందని, యురేనియం థోరియం వంటి అణు ఇంధనాల కంటే సులువుగా వెలికితీసి వాడుకోవచ్చని హెచ్‌బీ11 వ్యవస్థాపకుడు డాక్టర్ హెన్రిక్ హోరా చెబుతున్నారు. అణు రియాక్టర్లలోలా స్టీమ్ ఇంజన్లను ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషమంటున్నారు.
అరవై ఏళ్ల ప్రస్థానం..
1960: తొలి లేజర్ ఆవిష్కరణ
1960–78: లేజర్ల సాయంతో సంలీన ప్రక్రియపై ప్రొఫెసర్ హెన్రిక్ హోరా పరిశోధనలు
1978: శక్తిమంతమైన లేజర్లతో హైడ్రోజన్, బోరాన్ –11 (హెచ్‌బీ11)లను బాగా వేడి చేయకుండానే లయం చేయొచ్చని హెన్రిక్ హోరా ప్రకటన.
1985: అందుబాటులోకి చిర్ప్‌డ్ పల్స్ ఆంప్లిఫికేషన్ టెక్నాలజీ(సీపీఏ). డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న లేజర్ కిరణాల శక్తిని లక్షల రెట్లు పెంచేందుకు వీలేర్పడింది.
2005–2015: సీపీఏ టెక్నాలజీ సాయంతో హెచ్‌బీ11ను లయం చేయొచ్చని, ఇందుకు 2 పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయాల్సిన అవసరం లేదని పలువురు శాస్త్రవేత్తల నిరూపణ.
2014–2017: కేంద్రక సంలీన ప్రక్రియను సులువుగా సాధించే టెక్నాలజీపై పేటెంట్ హక్కులు నమోదు చేసిన హెచ్‌బీ11
2018: డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూలకు భౌతిక శాస్త్ర నోబెల్.
2019: హెచ్‌బీ11 ఎనర్జీ కంపెనీ ఏర్పాటు. తొలి అమెరికన్ పేటెంట్ మంజూరు!
Comments
Please login to add a commentAdd a comment