దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత అమెరికా తొలిసారి ఒక మహిళకు మరణశిక్ష అమలు చేయబోతోంది. ఆ మహిళ.. లీసా మాంట్‌గోమెరి. ఆమెను ఉరి తియ్యరు. ఎలక్ట్రిక్ చెయిర్‌లో కూర్చోబెట్టరు. ఇంజెక్షన్‌తో శిక్ష విధిస్తారు! ఒక నిండు గర్భిణిని హత్య చేసినందుకు ఆమెకు పడిన ఈ శిక్షను రద్దు చేయాలని ‘మరణ దండన’ను వ్యతిరేకించే మానవతావాదులు కొత్త అధ్యక్షుడు జోబైడన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే లీసా శిక్ష అమలవకుండా ఉండే అవకాశాలేమీ ఇప్పటికైతే కనిపించడం లేదు.
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసేలోపు, డొనాల్డ్ ట్రంప్ తను చేయదలచుకున్న పనులన్నిటికీ సంతకాలు పెట్టేస్తేన్నారు. చివరి నిముషపు సంతకాలు ఆయన ఎన్నైనా పెట్టి ఉండొచ్చు. వాటిల్లో ఆయన పెట్టిన ఒక సంతకాన్ని మాత్రం కొత్త అధ్యక్షుడు చెరిపేయాలని అమెరికన్ ప్రజల్లో ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఒక నేరస్థురాలికి కోర్టు విధించిన మరణశిక్షకు ఆమోదం తెలియజేస్తూ ట్రంప్ పెట్టిన సంతకం అది! ఆ నేరస్థురాలు లీసా మాంట్‌గోమెరి. ఒకవేళ లీసాకు శిక్షను తప్పించుకునే మార్గమే లేకపోతే డెబ్భై ఏళ్ల తర్వాత అమెరికా తొలిసారి ఒక మహిళకు విధించిన మరణశిక్ష అవుతుందది. ఈ నెల 12 న లీసాకు శిక్ష అమలు చేయాలని కొత్త సంవత్సరం రోజు అమెరికన్ కోర్టు అంతిమతీర్పు చెప్పింది. లీసాను ఉరి తీయరు. ఎలక్ట్రిక్ చెయిర్‌లో కూర్చోబెట్టి స్విచ్ ఆన్ చెయ్యరు. ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు. ‘‘అవును.. ‘చంపేస్తారు’ అనే అనాలి’’ అని అమెరికాలోని మానవతావాదులు లీసాకు క్షమాభిక్ష తిరస్కరించిన ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని తీసే హక్కు ట్రంప్‌కి ఎవరిచ్చారు?’’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘అలాగైతే నిండు గర్భిణిని చంపడం అమానుషం కాదా..’’ అని ఆమెకు మరణశిక్షను విధించడాన్ని సమర్థించేవారు అంటున్నారు.
లీసానే ఆ హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు కూడా రుజువు చేశాయి. ఇక ఆమె గానీ, ఆమె లాయర్‌లు గానీ మాట్లాడేందుకేమీ లేదు. ఆమె మరణశిక్షపై జిల్లా జడ్జి రుడాల్ఫ్ మాస్ జనవరి చివరివరకు స్టే ఇచ్చినప్పటికీ పై కోర్టు ఆ స్టేను కొట్టివేసి ఆమె మరణానికి ‘డేట్’ ఇచ్చింది. జనవరి చివరి వరకు రుడాల్ఫ్ స్టే ఇవ్వడం వెనుక ఉద్దేశం స్పష్టమైనదే. జనవరి 20న జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆమె మరణశిక్ష రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. జో బైడెన్ మరణశిక్షకు వ్యతిరేకం. ఆ ఆశతోనే జస్టిస్ రుడాల్ఫ్ ఆమెకు కొన్నాళ్లు ఆయుషు అందించారు. ఇప్పుడా ఆశా పోయింది. లీసా మానసిక స్థితి బాగోలేనందున ఆ హత్య చేసిందనే వాదనా గట్టిగా నిలబడలేకపోయింది. ఇప్పుడిక మనం రెండు విషయాలను మాట్లాడుకోవాలి. హత్యోదంతం గురించి ఒకటి. లీసాకు మానసిక స్థితి బాగోలేకపోవడం అన్నది ఇంకొకటి. మొదటి దాన్ని సమర్థించడానికి రెండోదాన్ని చెప్పుకోవడం కాదు. ఒక స్త్రీ జీవితంలో జరగకూడదనిదే లీసా జీవితంలో జరిగింది. అది.. లీసా చేసిన హత్య కన్నా కూడా ఘోరమైనది! మూడేళ్ల వయసులో తన పక్కన పడుకుని ఉన్న ఎనిమిదేళ్ల తన ప్రియమైన అక్కపై (మారుతండ్రి కూతురు) ఆమె సంరక్షకుడు (బేబీ సిటర్) పలుమార్లు అత్యాచారం జరపడం చూసింది లీసా. అలా చాలాకాలం పాటు చూస్తూనే ఉంది. ఆ తర్వాత లీసానే తన పదకొండో ఏట నుంచి మారుతండ్రి అత్యాచారానికి గురవడం మొదలైంది.
ఆ చిరుప్రాయపు లైంగిక హింస, తల్లి కూడా చూసీచూడనట్లు ఉండిపోవడం, మారు తండ్రి అతడి స్నేహితులను తనపైకి ఉసిగొల్పడం.. అవన్నీ ఆమె బాల్యాన్ని, యవ్వనాన్ని హరించాయి. ఆమె మతిస్థిమితం కూడా తప్పింది. కెవిన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది కానీ, ఆమెతో పాటు పెరిగి పెద్దదైన చిన్ననాటి భయానక మనోస్థితిని ఆమె దాంపత్య జీవితం ఏమాత్రం మార్చలేకపోయింది. కొన్నిసార్లు కెవిన్ కూడా ఆమె భయం చూసి విసుక్కునేవాడు. పాత జీవితాన్ని ఎందుకు మర్చిపోవు అని అడిగేవాడు. ఆమె దగ్గర సమాధానం లేదు. లైంగిక హింస, దాడి వల్ల లీసా బ్రెయిన్ కూడా దెబ్బతినిందని వైద్యులు గుర్తించారు కూడా. లీసా యు.ఎస్.లోని కన్సాస్‌లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 52 ఏళ్లు. గర్భిణిని హత్య చేసేటప్పటికి 36 ఏళ్లు. ఆమె చంపింది బాబీ జో స్టిన్నెట్ అనే 23 ఏళ్ల నిండు గర్భిణిని. స్టిన్నెట్ ఉండేది మిస్సోరీలో. లీసా ఉండేది కన్సాస్‌లో. మరి ఈ హత్య ఎలా జరిగింది? 2004 డిసెంబర్ 16. స్టిన్నెట్ తన గదిలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని మొదట చూసింది స్టిన్నెట్ తల్లి బెక్కీ హర్పర్. స్టిన్నెట్ కడుపు కోసి, బిడ్డను అపహరించుకెళ్లారెవరో! బెక్కీ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇరవై నాలుగ్గంటల లోపే దోషి పట్టుబడింది.
లీసా మాంట్‌గోమరీ! స్టిన్నెట్ మెయిల్స్‌ని తెరిచి చూసిన పోలీసులకు లీసాకు, స్టిన్నెట్‌కు మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసింది. వాళ్లిద్దరి చాటింగ్‌ని బట్టి ఇద్దరికీ కుక్కపిల్లల్ని పెంచడంలో ఆసక్తి ఉందని, వాటి ఫుడ్ గురించి ప్రత్యక్షంగా మాట్లాడుకోడానికి డిసెంబర్ పదహారున లీసా మిస్సోరీ వెళ్లి ఆమెను కలిసినప్పుడు ఈ హత్య జరిగిందనీ నిర్థారణ అయింది. లీసా నేరం ఒప్పుకుంది కానీ, తెలిసీ ఆ నేరాన్ని చేయలేదంది. అయితే స్టిన్నెట్ కడుపులోని బిడ్డను అపహరించుకుని వెళ్లడాన్ని బట్టి చూస్తే మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆ హత్య చేసినట్లు స్పష్టం అవుతోంది. బిడ్డను స్టిన్నెట్ భర్తకు అప్పగించి, అదే రోజు లీసాను అరెస్ట్ చేశారు. పద్నాలుగేళ్లుగా కేసు నడిచి మొన్నటికి తీర్పువచ్చింది. అమెరికాలో ప్రస్తుతం మరణశి„ý పడి ఖైదీలుగా ఉన్న 55 మంది మహిళల్లో లీసా ఒకరు. ఒకవేళ లీసాను జనవరి 12న ఉరి తీసినా.. మిగతా యాభై నాలుగు మందికి జో బైడెన్ మరణాన్ని తప్పిస్తారనే భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment