బుకారెటస్ట్, రొమేనియా: గత నెల ఉటా ఎడారిలో ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షం అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. సడెన్‌గా ప్రత్యక్షం అయిన దిమ్మె.. అంతే సడెన్‌గా మాయమవ్వడంతో ఏలియన్స్ పనే అని చర్చించుకుంటున్నారు నెటిజనులు. లోహపు దిమ్మె కనిపించకుండా పోయినప్పుడు ‘ఉటా ఎడారి నుంచి మాయమయ్యింది.. ఇక ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షం కానుందో’ అంటూ కామెంట్ చేశారు కొందరు నెటిజనులు. వారి మాటలు నిజమయ్యాయి. ఉటాలో మాయమైన లోహపు దిమ్మె ప్రస్తుతం యూరప్‌లో ప్రత్యక్షమయ్యింది. యూరప్ దేశం రొమేనియాలో... ఓ లోహ స్తంభం సడెన్‌గా ప్రత్యక్షమైంది. త్రికోణ ఆకారంలో ఉన్న ఈ లోహ స్తంభం... రొమేనియాలోని... పియత్రా నీమ్త్‌లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల అవతల కనిపించిందని డైలీ మెయిల్ తెలిపింది.
తాజా స్తంభం... 13 అడుగుల ఎత్తు ఉంది. సియాహ్లూ పర్వతం వైపు చూస్తున్నట్లుగా ఉంది. రొమేనియాలోని సహజమైన 7 వింతల్లో ఆ పర్వతం కూడా ఉంది. ఐతే... ఉటా ఎడారిలో మాయమైన లోహపు దిమ్మె, ఇదీ... రెండు వేరు వేరని చెబుతున్నారు. ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మె 10-12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్‌తో తయారై ఉంది. ఇక ఈ లోహపు దిమ్మె తమ దేశంలో ప్రత్యక్షం కావడంతో రొమేనియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాని మిస్టరీ విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే... మేమూ దాన్ని మొదటిసారి చూస్తున్నాం అని చెబుతున్నారు. అది ప్రభుత్వానికి చెందినది కాదనీ... అందువల్ల దాన్ని తాము ఏమీ చెయ్యలేమనీ... కాకపోతే... దాని ఓనర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అధికారులు. అది చారిత్రక, పురాతత్వ రక్షణ వలయ ప్రాంతంలో ఉండటం వల్ల ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా వస్తువును అక్కడ ఉంచాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవి లేకుండా రాత్రికి రాత్రే ఈ లోహపు స్తంభం ఇక్కడ ప్రత్యక్షం కావడంతో ప్రజలతో పాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది)
ఉటా ఎడారిలో నుంచి దాన్ని తొలగించింది మేమే
ఇక ఉటా ఎడారిలో కనిపంచిన లోహపు దిమ్మెను ఎవరు తొలగించారనే దానికి సమాధానం లభించింది. అయితే దాన్ని తొలగించింది ఏలియన్స్ మాత్రం కాదు. నలుగురు వ్యక్తులు దాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని రాస్ బెర్నార్డ్స్ అనే ఫోటోగ్రాఫర్ తెలిపారు. ఎడారిలో ఉన్న లోహపు దిమ్మెని ఫోటో తీయడానికి వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు దాన్ని తొలగించడం తన కెమరా కంటికి చిక్కిందని తెలిపాడు. అంతేకాక వారి ఫోటోలను తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు బెర్నార్డ్స్. మంగళవారం తరువాత, 34 ఏళ్ల స్లాక్‌లైన్ ప్రదర్శనకారుడు, సాహస క్రీడాకారుడు ఆండీ లూయిస్ ‘మేము ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెని తొలగించాం’ అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment