రష్యాలోని దక్షిణ ప్రావిన్స్ డాగేస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రైస్తవులు, యూదుల ప్రార్థనా మందిరాలపై అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ముష్కరుల దాడుల్లో 15 మందికి పైగా పోలీసులు, పలువురు పౌరులు మృతి చెందారని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు.
ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 15 దాటిందని సమాచారం. దాడి చేసిన వారిపై రష్యా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. డాగేస్తాన్ పబ్లిక్ మానిటరింగ్ కమిషన్‌కు చెందిన అధికారి షామిల్ ఖదులేవ్ మాట్లాడుతూ చర్చిపై జరిగిన దాడిలో ఒక ఫాదర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారని తెలిపారు. చర్చిలో హత్యకు గురైన ఫాదర్‌ను 66 ఏళ్ల నికోలాయ్‌గా గుర్తించారు. అలాగే చర్చికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారు.
ఈ ఉగ్రవాద దాడి అనంతరం యూదుల ప్రార్థనా స్థలంలో మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. ఆదివారం మూడు చోట్ల దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మఖచ్కల నగరంలో పోలీసుల ట్రాఫిక్ స్టాప్‌లపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడుల తీరు చూస్తుంటే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. డెర్బెంట్ నగరంపై దాడి జరిగిన సమయంలోనే మఖచ్కలలోని పోలీసు ట్రాఫిక్ పోస్ట్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక పోలీసు గాయపడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment