
మెల్‌బోర్న్: కోవిడ్–19 మహమ్మారి ఈ ఏడాది ఆస్ట్రేలియా వలస వెళ్లాలనుకున్న వేలాది మంది.. ముఖ్యంగా భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆస్ట్రేలియాకు 2018–19 సంవత్సరంలో 2.32 లక్షల మంది వలస వెళ్లగా కోవిడ్ ఆంక్షల కారణంగా 2020–21 సంవత్సరంలో ఆ సంఖ్య కాస్తా 31 వేలకు పడిపోయిందని ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, సరిహద్దుల మూసివేత వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.
ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వలసలపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 7 లక్షల మంది భారతీయులున్నారు. నిపుణులైన భారతీయులే ఆస్ట్రేలియా ప్రధాన ఉద్యోగ వనరు. అంతేకాదు, 90 వేల మంది భారతీయులు ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. విదేశీ ప్రయాణాలపై నిషేధం తొలగించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది.