ప్రతీకాత్మక చిత్రం
కాన్‌బెర్రా: అఫ్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికులు జరిపిన దుశ్చర్యలు ఆలస్యంగా వెలుగులోనికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు 39 మంది నిరాయుధ పౌరులను, ఖైదీలను చట్టవిరుద్ధంగా చంపినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా జనరల్ గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రత్యేక యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్‌తో ప్రస్తావించారు. 2005 నుంచి 2016 మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో సైనికుల దుష్ప్రవర్తనపై సంవత్సరాల తరబడి జరిపిన దర్యాప్తులో భయంకరమైన నిజాలను తెలుసుకున్నామని డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్‌బెల్ తెలిపారు. ఒక దశాబ్దం పాటు సైనికుల్లోని ఉన్నత దళాలు శిక్ష మినహాయింపుకోసం "విధ్వంసకర"మైన సంస్కృతిని అవలంభించాయని, తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో హత్యలు జరిగాయని పేర్కొన్నారు.
బయటకు వచ్చిన నిజాలు..
‘నిఘా సిబ్బందిలో కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నియమాలను కాలరాశారు, కల్పిత కథలను సృష్టించారు. అబద్ధాలు చెప్పారు. పలు ఖైదీలను చంపేశారు’ అని కాంప్‌బెల్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. కాగా 'బ్లడింగ్' (వేట) అని పిలువబడే వికృత క్రీడలో కొంత మంది నిఘా సిబ్బంది మొదటిసారిగా కాల్చే అవకాశం కోసం ఖైదీలను బలవంతంగా కాల్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరగడానికి జూనియర్ సైనికులే కారణమని ఆరోపించారు. మిలిటరీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గురువారం 465 పేజీల అధికారిక నివేదికలో డజన్ల కొద్దీ హత్యలు జరిగాయని తెలిపింది. ఈ నివేదికలో బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సిఫార్సుచేసింది. 39 మందిని చట్టవిరుద్ధంగా హత్య చేయడంతో రెజిమెంట్, సాయుధ దళాలు, ఆస్ట్రేలియాకు మాయని మచ్చ తెచ్చారని కాంప్‌బెల్ అన్నారు. యుద్ధ నేరాలకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు అధికారికి ఈ వివరాలను పంపుతామన్నారు.
సేవా పతకాలు తిరిగి వెనకీ..
కాంప్‌బెల్ 2007- 2013 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన సైనిక దళాలకు ఇచ్చిన కొన్ని విశిష్ట సేవా పతకాలను ఉపసంహరించుకుంటామన్నారు. సెప్టెంబర్ 11, 2001 దాడుల తరువాత, తాలిబన్, అల్-ఖైదా, ఇతర ఇస్లామిస్ట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుఎస్, మిత్రరాజ్యాల దళాలతో కలిసి పోరాడటానికి 26,000 మందికి పైగా ఆస్ట్రేలియా సైనికులను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపారు. ఆస్ట్రేలియన్ సైనిక దళాలు అధికారికంగా 2013లో దేశంను విడిచి వెళ్లినా, ఉన్నత బలగాలు తరచూ క్రూరమైన పనులు చేసే వారని తెలిసింది. సైనికులు జరిపిన దాడిలో ఆరేళ్ల చిన్నారిని చంపినట్లు నివేదికలు వచ్చాయి. అంతేకాకుండా హెలికాప్టర్‌లో స్థలం లేకపోవడంతో ఖైదీని కాల్చి చంపేశారు.(చదవండి: లాక్‌డౌన్ నియమాలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు..
ఆస్ట్రేలియా ప్రభుత్వం నివేదిక తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. మోరిసన్ ప్రభుత్వం బుధవారం ఈ చర్యలను చాలా తీవ్రంగా పరిగణించిందని ఆఫ్ఘాన్ రాయబారికి తెలిపింది. ఇక సైనిక చర్యలపై ప్రధాని మోరిసన్ తన ప్రగాడ సానుభూతిని తన ట్వీట్లతో వ్యక్తం చేశారు. గత వారం, మోరిసన్ యుద్ధ నేరాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పరిశోధకుడిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
మీడియాపై దాడులు..
ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో తప్పు చేసినట్లు తెలిపిన సంస్థ నివేదికలను అణిచివేసేందుకు ప్రయత్నించింది, పోలీసులు నివేదికలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మొదట ప్రజల దృష్టికి ‘ఆఫ్ఘన్ ఫైల్స్’ పేరుతో 2017లో ఆస్ట్రేలియా జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆస్ట్రేలియా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో నిరాయుధ పౌరులను, పిల్లలను చంపారని ఆరోపించారు. ప్రతిస్పందనగా, ఆస్ట్రేలియా పోలీసులు ఇద్దరు రిపోర్టర్లపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును విరమించుకునే ముందు, గత సంవత్సరం సిడ్నీలో ఏబీసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment