Courtesy: Twitter
మింక్: ‘‘అవును.. నేను తప్పు చేశాను. నేరాన్ని అంగీకరిస్తున్న. ప్రస్తుతం నేను మింక్‌లోని నంబర్ 1 డిటెన్షన్ సెంటర్‌లో సురక్షితంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గుండెతో పాటు ఇతర అవయవాలు కూడా బాగా పనిచేస్తున్నాయి’’... బెలారస్ జర్నలిస్టు రోమన్ ప్రొటాసెవిక్ నేరం అంగీకరిస్తున్నట్లుగా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. గ్రీస్ నుంచి లిథువేనియాకు విమానంలో వెళ్తున్న అతడిని బెలారస్ ప్రభుత్వం ఆదివారం అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. రోమన్ ప్రయాణిస్తున్న రియాన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సందేశంతో, యుద్ధ విమానం ఎస్కార్టుగా రాగా, దానిని తమ రాజధాని మింక్‌లో అత్యవసరంగా ల్యాండ్ కాగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే నిరసనలకు కేంద్ర బిందువు అయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో.. రోమన్‌ను బంధించేందుకే సుమారుగా 170 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ‘హైజాక్’ చేయించారంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో... పోలీసుల అదుపులో ఉన్న రోమన్ ఆరోగ్యం చెడిపోయిందనే వార్తలు మరోసారి ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి.
ఈ విషయంపై స్పందించిన బెలారస్ హోం మంత్రి.. రోమన్ బాగానే ఉన్నాడని, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రోమన్‌తో స్వయంగా వీడియో విడుదల చేయించడం గమనార్హం. ఇందులో.. ‘‘నన్ను బాగా చూసుకుంటున్నారు. చట్టప్రకారం వాళ్లు చేస్తున్నది సరైనదే. విచారణాధికారులకు నేను పూర్తిగా సహకరిస్తాను. మింక్ సిటీలో మూకుమ్మడి నిరసన కార్యక్రమాలకు నేనే కారణం అన్న విషయాన్ని అంగీకరిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
అయితే, రోమన్ సహచర జర్నలిస్టు స్టెఫాన్ పుటిలో మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. ‘‘తన చేత బలవంతంగా ఈ మాటలు చెప్పించారనడానికి, అతడి నుదురు మీద ఉన్న నల్లటి మచ్చలే ఉదాహరణ’’ అంటూ రోమన్ పట్ల అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. అతడిని కొట్టినట్లుగా ఆనవాలు కనబడుతుంటే, ఈ వీడియోను ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. కాగా స్థానిక చట్టాల ప్రకారం.. బహిరంగ మూకుమ్మడి నిరసనకు కారణమైన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ఇక అధ్యక్ష ఎన్నికల సమయంలో రోమన్ చట్టవ్యతిరేకంగా వ్యవహరించాడని అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక గత రెండు దశాబ్దాలుగా బెలారస్‌ను పాలిస్తున్న అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించిన నేపథ్యంలో.. ఉద్దేశపూర్వంగానే ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆయనను విమర్శిస్తున్నారు.
చదవండి: Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’
"I confess and cooperate with the investigation" says Roman #Protasevich in a video released by the #Belarusian authorities. This obviously looks like a forced confession; + the marks on his forehead..
— inna shevchenko (@femeninna) May 24, 2021
pic.twitter.com/a7L3gtQkP2
Comments
Please login to add a commentAdd a comment