శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక.
ప్రమిద వెలిగించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
హాజరైన 600మందికి పైగా భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది.
మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం.
మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు.
అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment