
ఢాకా: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారత్‌ను కోరింది. ఆమెను బంగ్లాకు అప్పగించాలని బీఎన్‌పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మంగళవారం భారత్‌కు కోరారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్‌పీ స్పష్టం చేసింది.
ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బీఎన్‌పీ వ్యవస్థాపకుడు జియా-ఉర్ రెహమాన్ సమాధి వద్ద మీర్జా ఫఖ్రుల్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నాం. ఈ దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె కచ్చితంగా విచారణను ఎదుర్కొవల్సిందే. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించటం వల్ల భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను నిలుపుకోవడం లేదు. షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనలేక దేశం విడిచి పారిపోయారు. పొరుగు దేశం (భారత్) హసీనాకు ఆశ్రయం కల్పించటం దురదృష్టకరం’ అని అన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment