లండన్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకి ఆస్పత్రి పాలవకుండా టీకా బూస్టర్ డోస్ 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని బ్రిటన్‌కు చెందిన యూకేఎస్‌హెచ్‌ఏ(యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ) అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ టీకా మొదటి రెండు డోసుల కన్నా మూడో డోసు అత్యధిక రక్షణనిస్తుందని తెలిపింది. కోవిడ్ టీకాల రెండో డోసు తీసుకున్న 6 నెలల అనంతరం వాటి రక్షణ 52 శాతానికి పడిపోతోందని ఆరోగ్య నిపుణుడు ప్రొఫెసర్ ఎరిక్ టోపాల్ చెప్పారు.
ఈ సమయంలో బూస్టర్‌డోస్ ఇవ్వడం వల్ల కరోనాకు వ్యతిరేకంగా రోగనిరధోకత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బూస్టర్‌డోస్‌తో టీకా రక్షణ సామర్థ్ధ్యం ( రెండోడోసు ముగిసిన ఆరు నెలల తర్వాత) 52 నుంచి 88 శాతానికి పెరుగుతుందని ఎరిక్ చెప్పారు. రెండేళ్ల కిత్రం వెలుగు చూసిన వైరస్ స్పైక్ ప్రొటీన్ ఆధారంగా టీకాలు తయారు చేశారు. అయితే తర్వాత కాలంలో వైరస్ పలు రూపాంతరాలు చెంది ఒమిక్రాన్‌గా అవతరించింది. అయినప్పటికీ మూడో డోసు ఇస్తే టీకాలు దీన్ని సమర్ధవంతంగా అడ్డుకోవడం విశేషమని ఎరిక్ అభిప్రాయపడ్డారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆస్పత్రి పాలవడం మూడు రెట్లు తక్కువగా ఉందని పరిశోధన తెలిపింది.
ఐసీయూలో చేరికలు తక్కువే: బోరిస్
బ్రిటన్‌లో ఒమిక్రాన్ కారణంగా ఐసీయూలో చేరికలు తక్కువగానే ఉన్నాయని, గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం తెలిపారు. ముందు జాగ్రత్తకోసం బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోమారు ఆయన గుర్తు చేశారు. ఒమిక్రాన్‌తో ఐసీయూలో చేరిన కేసుల్లో అత్యధికం బూస్టర్ తీసుకోనివేనన్నారు. తన మంత్రులు గతంలో భావించినట్లు తీవ్రమైన లాక్‌డౌన్ నిబంధనలు అవసరపడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గతవేరియంట్ల కన్నా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఇంగ్లండ్‌లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment