పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు | British Govt Exempt Parliament Bar Permits To Open Till Midnight | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు

Published Mon, Sep 28 2020 6:02 PM | Last Updated on Mon, Sep 28 2020 8:46 PM

British Govt Exempt Parliament Bar Permits To Open Till Midnight - Sakshi

రోజు రోజుకు విజంభిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా బ్రిటిష్‌ ప్రభుత్వం శనివారం నుంచి మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా ఇంగ్లండ్‌లోని అన్ని పబ్‌లను, బార్లను, రెస్టారెంట్లను రాత్రి పది గంటలకల్లా కచ్చితంగా మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పబ్‌లో, బార్లలో కూడా ఒక చోట ఎనిమిది మందికి మించి గుమికూడరాదంటూ, విధిగా మాస్కులు ధరించాలంటూ, పబ్‌లు, బార్లకు వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ఫోన్‌ నెంబర్లు, చిరునామాలను నిర్వాహకులు తీసుకోవాలంటూ కూడా నిబంధనలు విధించింది. 

అయితే కొంత మంది ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ ఆంక్షల నుంచి ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లోని బార్లను ‘వర్కింగ్‌ ప్లేస్‌ క్యాంటీన్‌’ కేటగిరీ కింద మినహాయించింది. పార్లమెంట్‌ ఆవరణలో మొత్తం 30 బార్లు ఉన్నాయి. వీటిలో కొన్ని గెస్ట్‌లను అనుమతించే బార్లు ఉండగా, జర్నలిస్టులను అనుమతించే బార్లు కొన్ని ఉన్నాయి. కొన్ని బార్లలో ఎంపీలకు మాత్రమే అనుమతి ఉంది. ది లార్డ్స్‌ బార్, ది బిషప్స్‌ బార్, దీ పీర్స్‌ డైనింగ్‌ రూమ్, ది పీర్స్‌ గెస్ట్‌ రూమ్, ది పూజిన్‌ రూమ్, ది టెర్రేస్‌ పెవీలియన్, ది స్ట్రేంజర్స్‌ బార్, ది టెర్రేస్‌ కాఫెటేరియా, ది థేమ్స్‌ పెవీలియన్, ది స్పీకర్స్‌ స్టేట్‌ రూమ్స్, ది రివర్‌ రెస్టారెంట్, బెల్లమీస్, ది డిబేట్, ది జూబ్లీ రూమ్, ది అడ్జెర్న్‌మెంట్, ది మెంబర్స్‌ డైనింగ్‌ రూమ్, ది స్ట్రేంజర్స్‌ డైనింగ్‌ రూమ్, ది స్పోర్ట్స్‌ అండ్‌ సోషల్‌ బార్, ది ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ రూమ్, ది చర్చిల్‌ రూమ్, ది కోల్‌మాండ్‌లే రూమ్, ది బెర్రీ రూమ్, ది హోం రూమ్, జూబ్లీ కేఫ్, ది అట్లీ రూమ్, మిల్‌బ్యాంక్‌ హౌజ్‌ కేఫ్‌టేరియా, ది రివర్‌ డైనింగ్‌ రూమ్స్, మాన్‌క్రీఫ్స్‌లలో బార్లు ఉన్నాయి. వీటిలో మాన్‌క్రీఫ్స్‌ జర్నలిస్టులకు ప్రత్యేకం. ఇవి ఎప్పటిలాగే రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తాయి. 
(చదవండి: ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రిటన్‌ పరిశోధకులు)



వీటిలో మూడు డాలర్లకు ఒక్క బీరు చొప్పున సబ్సిడీపై అందజేస్తున్నారు. ఫలితంగా ఏటా 8 మిలియన్‌ డాలర్ల సబ్సిడీ భారం పన్ను చెల్లింపుదారులపై పడుతోంది. 1980లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం బ్రిటిష్‌ ఎంపీల్లో ఎక్కువ మంది తాగే వారు ఉండగా, వారిలో పది శాతం మంది ఎక్కువ తాగడమే కాకుండా చికిత్స కోసం రీహాబిలిటేషన్‌ సెంటర్లకు వెళతారట. దివంగత లిబరల్‌ డెమోక్రటిక్‌ నాయకుడు చార్లెస్‌ కెన్నడీ ఓ సారి బాగా తాగి బడ్జెట్‌ సెషన్‌కు వెళ్లి ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నారట. అప్పుడు ఆయన్ని పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది తీసుకెళ్లి ఆయన కార్యాలయంలో నిర్బంధించి, బయటి నుంచి తాళం వేశారట. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో తాగి, తాగి చనిపోయారట.



2013లో లేబర్‌ ఎంపీ ఎరిక్‌ జాయిస్‌ను పార్లమెంట్‌ బారుల్లోకి అనుమతించకుండా నిషేధం విధించారు. తాగి పార్లమెంట్‌ సెషన్‌కు వెళ్లి తనతో విభేదించిన ఎంపీలను తలతో ‘డిచ్‌’ కొట్టడమే అందుకు కారణమట. అలా ఆయన ఆరుగురు ఎంపీల తలలు పగులగొట్టారట. పార్లమెంట్‌లో ఇన్ని బార్లు ఎందుకు అనే అంశం పలు సార్లు చర్చకు వచ్చినప్పటికీ పాత బార్లు మూతపడకపోగా కొత్త బార్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఆంక్షల నుంచి పార్లమెంట్‌ బార్లకు మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement