
మీకు వెయిట్ లిఫ్టింగ్ తెలుసుగా.. అదేనండి, బరువులెత్తే పోటీ.. మరి మీకు ఫింగర్ లిఫ్టింగ్ గురించి తెలుసా? ఒంటి వేలితో భారీ బరువులు ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకే ఒక వేలితో బరువులు ఎత్తడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ బ్రిటన్‌కు చెందిన స్టీవ్ కీలర్ (48) అనే వ్యక్తి కేవలం తన మధ్య వేలితో భారీ బరువును పైకెత్తి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఆయన పైకెత్తిన బరువు ఎంతో తెలుసా? ఏకంగా 129.49 కిలోలు. కెంట్ నగరంలోని యాష్‌ఫోర్డ్‌కు చెందిన కీలర్ ఓ కరాటే యోధుడు. తన 18 ఏట నుంచే కరాటే శిక్షణ పొందుతున్న కీలర్ గత నాలుగేళ్లుగా బలాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
అలా శిక్షణ పొందే క్రమంలో ఓసారి అలవోకగా 111 కిలోల బరువు ఎత్తేశాడట. అప్పటివరకు ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఇది కేవలం 10 కిలోలు మాత్రమే తక్కువట. దీంతో కొత్త రికార్డు నెలకొల్పడంపై దృష్టిపెట్టిన కీలర్.. తాజాగా 129.49 కిలోల బరువుగల ఆరు ఇనుప డిస్క్‌లను తన మధ్య వేలితో పైకిత్తి గిన్నిస్‌కెక్కాడు. కీలర్ ధాటికి 2012లో అర్మేనియాకు చెందిన బెనిక్ అనే యువకుడు ఒంటి వేలితో పైకెత్తిన 121.69 కిలోల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. తన రికార్డును ఇటీవల మరణించిన, తనకు బలాన్ని పెంచుకోవడంలో శిక్షణ ఇచ్చిన పినతండ్రికి అంకితమిచ్చాడు.
చదవండి: ప్రపంచంలో తొలి సోలార్ పవర్ కారు.. విశేషాలు ఇవే
Comments
Please login to add a commentAdd a comment