ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. వాస్తవానికి కరోనా వ్యాక్సిన‍్లను 18 ఏళ్ల లోపు పిల్లలకు వేయించుకునేందుకు అనుమతి లేదు. కానీ కెనడా ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సర‍్వత్రా చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా కెనడియన్ ఫెడరల్ హెల్త్ మినిస్ట్రీలోని సీనియర్ సలహాదారు సుప్రియ శర్మ మాట్లాడుతూ. జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో తయారు చేసిన ఫైజర్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు సురక్షితమైందని, కరోనాను అరికడుతుందని అన్నారు.
18 ఏళ్ల లోపు వయసువారికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతినిచ్చిన తొలిదేశం కెనడాయేనని సుప్రియ శర్మ వెల్లడించారు. కెనడాతో పాటు అమెరికా కూడా చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేలా అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు జర్మనీకి చెందిన ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా 18 ఏళ్ల వారితో పోల్చుకుంటే 12 నుంచి 15 ఏళ్ల వయసు వాళ్లలో టీకా తీసుకొన్న తర్వాత దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదని ఈ మార్చిలో విడుదల చేసిన నివేదికలో ఫైజర్ తెలిపిన సంగతి విదితమే.
మరోవైపు ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల రక్తం గడ్డకట్టి మరణించినట్లు తెలుస్తోంది. అయినా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని కొన సాగిస్తామని ఆరోగ్యశాఖ అధికారి జెన్నిఫర్ రస్సెల్ తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఎదురయ్యే సమస్యల కంటే వ్యాక్సిన్ వేయించుకోక పోవడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా, కెనడాలో ఇప్పటి వరకు 12 లక్షల 60 వేల మందికి కరోనా సోకింది. వారిలో 20% మంది 19 ఏళ్ల వయస‍్సు వారే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక కరోనా నుంచి 11లక్షల 50వేల మంది కోలుకోగా 24,450 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment