ట్రంప్ బెదిరింపు నేపథ్యంలో కెనడా యోచన
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే.
ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్‌మ్యాన్‌లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు.
ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు.
అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి.
ప్రతీకార సుంకాల పరిశీలన..
అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది.
మెక్సికోతో ట్రంప్ చర్చలు
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి
అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్‌బామ్‌కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్‌చేశారు.
‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment