డేటా లీకేజీ ఉదంతం... చాట్‌జీపీటీపై ఇటలీ నిషేధం | ChatGPT banned in Italy over privacy concerns | Sakshi
Sakshi News home page

డేటా లీకేజీ ఉదంతం... చాట్‌జీపీటీపై ఇటలీ నిషేధం

Published Mon, Apr 3 2023 6:08 AM | Last Updated on Mon, Apr 3 2023 6:48 AM

ChatGPT banned in Italy over privacy concerns - Sakshi

పారిస్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్‌ యూనియన్‌ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్‌జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే.

ఎందుకు?
యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్‌జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్‌జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్‌ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్‌ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది.

‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్‌జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్‌ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్‌జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్‌ పిల్లల కంటపడే రిస్కుంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది.

చాట్‌జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్‌ లైన్లు, చాట్‌ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్‌జీపీటీని కొంతకాలం ఆఫ్‌లైన్‌ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్‌ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్‌ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది.

 20 రోజుల్లో నివేదించాలి
నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్‌ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్‌జీపీటీని నిషేధించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement