చైనా గస్తీ నౌకను ఢీకొట్టిన ఫిలిప్పీన్స్ సరుకు నౌక
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణచైనా సముద్రంపై తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేసి యా, వియత్నాం, బ్రూనై, తైవాన్‌లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. రెండు ఓడల ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
అసలేం జరిగింది?
నన్షా ద్వీపాల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దిబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెల్సికూడా ఉద్దేశపూర్వకంగా అదే దిశలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్‌కు చెందిన సరకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్(సీసీజీ) ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌకపై మేం నియంత్రణ సాధించామని సీసీజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుబట్టింది.
‘‘చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ షావల్ స్థావరంలోని మా బలగాలకు సరకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది’’ అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరేస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) పరిధిలో ఉండేది.
2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసా గుతోంది. దక్షిణ చైనా సముద్రజలాల గుండా ప్రయాణించే పొరుగుదేశాల సరకు రవాణా నౌకలపై తరచూ జల ఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నావికాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెల్సిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజులపాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment