South China Sea area
-
దక్షిణ చైనా సముద్రంలో కలకలం
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణచైనా సముద్రంపై తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేసి యా, వియత్నాం, బ్రూనై, తైవాన్లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. రెండు ఓడల ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.అసలేం జరిగింది?నన్షా ద్వీపాల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దిబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెల్సికూడా ఉద్దేశపూర్వకంగా అదే దిశలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్‌కు చెందిన సరకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్(సీసీజీ) ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌకపై మేం నియంత్రణ సాధించామని సీసీజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ షావల్ స్థావరంలోని మా బలగాలకు సరకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది’’ అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరేస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) పరిధిలో ఉండేది. 2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసా గుతోంది. దక్షిణ చైనా సముద్రజలాల గుండా ప్రయాణించే పొరుగుదేశాల సరకు రవాణా నౌకలపై తరచూ జల ఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నావికాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెల్సిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజులపాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. -
అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాలపై దాదాపుగా ఢీ కొట్టబోయింది. చైనా జెట్ అత్యంత ప్రమాదకరంగా దూసుకు రావడంతో అమెరికా నిఘా విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పుని తప్పించారు. ఇది డిసెంబర్ 21న జరిగిందని అమెరికా ఇండో ఫసిఫిక్ కమాండ్ వెల్లడించింది. ‘‘అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్సీ–135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే–11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల (20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది’’ అంటూ నిందించింది. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చినా డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అమెరికా యుద్ధ విమానాలను, నౌకలను మోహరిస్తూ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించడం దానికి మింగుడు పడడం లేదు. అమెరికా తన నిఘా కార్యకలాపాలతో చైనాకు పెనుముప్పుగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామని స్పష్టం చేశారు. -
డోక్లాంలోకి మళ్లీ చైనా
వాషింగ్టన్: డోక్లాం ప్రాంతంలోకి చైనా మరోసారి చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని ఇటు భారత్, భూటాన్ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై చైనా అక్రమంగా కృత్రిమ ద్వీపాలు నిర్మాణంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ జరిగిన సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలైస్ వెల్స్ మాట్లాడారు. భారత్ సరిహద్దులో రోడ్ల నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసిందన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు అన్ వాగ్నర్ మాట్లాడుతూ ‘డోక్లాం వివాదం సద్దుమణిగిన తర్వాత చైనా నెమ్మదిగా డోక్లాంలో తన కార్యకలాపాలను పునరుద్ధరించింది. ఈ విషయంపై భూటాన్, భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హిమాలయ ప్రాంతంలో చైనా చర్యలు.. దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశ విధానాలను గుర్తుకుతెస్తున్నాయి. మన వైఫల్యాల వల్ల దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం మోహరించింది. ఇప్పుడు హిమాలయ సరిహద్దుల్లో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీనికి అంతర్జాతీయ స్పందనేంటి? అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోంది’అని వాగ్నర్ పశ్నించారు. అది భారత్ సొంత విషయం ఈ చర్చ సందర్భంగా వెల్స్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. ‘ఉత్తర సరిహద్దులను సంరక్షించుకునేందుకు భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా డోక్లాం వివాదం భారత్‌కు చెందిన విషయం’ అని అన్నారు. గతేడాది జరిగిన డోక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో చైనా రోడ్డు నిర్మాణాలను చేపట్టడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత దౌత్యపరమైన చర్చలతో వివాదం సద్దుమణిగింది. కొత్త నిర్మాణాల్లేవ్: భారత్ డోక్లాం ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలేవీ చోటుచేసుకోలేదని, అక్కడ యథాతథ స్థితి నెలకొని ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. డోక్లాం దక్షిణ ప్రాంతంలో చైనా కొత్తగా రోడ్ల నిర్మాణం చేపడుతోందా అని రాజ్యసభలో వేసిన లిఖిత పూర్వక ప్రశ్నకు సింగ్ ఈ మేరకు బదులిచ్చారు. కిందటేడాది ఆగస్టు 28న డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ దళాలు మోహరించినప్పటి నుంచీ ఎవరూ అక్కడ కొత్తగా ఏ నిర్మాణం చేపట్టలేదన్నారు. -
మా భూభాగాన్ని వదులుకోం: జిన్‌పింగ్
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని భూభాగాలను తాము వదులుకోబోమని, అదేసమయంలో అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులను సృష్టించే ఉద్దేశం తమకు లేదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి మాటిస్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియా దేశాల సమీపంలోని చిన్న దీవులను ఆక్రమించడం, వాటిలో ఆధునిక ఆయుధ సంపత్తిని మోహరించడాన్ని భేటీ సందర్భంగా జిన్‌పింగ్ సమర్ధించుకున్నారు. ‘మేం పటిష్ట సామ్యవాద దేశాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. శాంతి పూర్వక అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. వలస, విస్తరణ వాదాలను కోరుకోవటం లేదు. అంతర్జాతీయంగా అలజడులను సృష్టించాలనుకోవటం లేద. పూర్వీకులు మాకిచ్చిన భూభాగాలపై మాకు హక్కుంది. ఆ భూభాగాల్లో ఒక్క అంగుళం కూడా వదలం’ అని అన్నారు. -
కొత్త వివాదాలకు బీజం
గత కొన్నేళ్లుగా వీడని చిక్కుముడిలా తయారైన దక్షిణ చైనా సముద్ర ప్రాంత వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆ సముద్ర జలాల్లో ఉన్న చిన్న దీవులు, పగడాల దిబ్బలు, ఇసుక మేటలు తనవేనని, వాటిపై తనకు ‘చారిత్రక హక్కులు’ ఉన్నాయని చైనా చేస్తున్న వాదన చెల్లుబాటు కాదని హేగ్‌లోని అంతర్జాతీయ సాగర జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మంగళవారం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఈ వివాదంలో మూడేళ్లక్రితం చైనాపై ఫిలిప్పీన్స్ ఇచ్చిన ఫిర్యాదును విచారించి ఈ తీర్పును వెలువరించింది. అయితే విచారణను గుర్తించడానికి లేదా ఇందులో తన వాదనేమిటో వినిపించడానికి ఆదిలోనే చైనా తిరస్కరించింది. ఆ ప్రాంతంపై తన కున్న చారిత్రక హక్కులు విచారణలకూ, వాదనలకూ అతీతమని చెప్పింది. అలా ప్రకటించడంతోపాటు మునుపటితో పోలిస్తే ఆ ప్రాంతంలో తన ఉనికిని బాగా పెంచింది. ముఖ్యంగా అక్కడున్న స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం చేపట్టింది. మరికొన్నిచోట్ల ఉన్నవాటిని విస్తరించింది. నావికాదళం కార్య కలాపాల జోరు పెంచింది. అందుకు గల ప్రాతిపదికను గురించి చైనా చేస్తున్న వాదన ఇప్పుడు ఫిలిప్పీన్స్, చైనాల వివాదానికి మూలం. 1947 డిసెంబర్లో... అంటే చైనాలో విప్లవం విజయవంతం కావడానికి ముందు అప్పటి ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రానికి చెందిన భౌగోళిక చిత్రపటంలో ఇంగ్లిష్ అక్షరం ‘యు’ ఆకారంలో పదకొండు గీతలు గీసింది.‘ఎలెవెన్ డాష్ లైన్’గా పిలిచే ఆ పరిధిలోపల ఏ రకమైన దీవులున్నా తమవేనని తేల్చిచెప్పింది. అందుకు కారణం కూడా చెప్పింది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో అప్పటి రాజవంశీకులు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయని వివరించింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడ్డాక పాత పరిధులను గుర్తించి కొనసాగించినా... అప్పటి ప్రధాని చౌ ఎన్లై ఉత్తర వియత్నాంలోని తమ కమ్యూనిస్టు సోదరుల అభీష్టాన్ని మన్నించి ఇందులో రెండు గీతల్ని తగ్గించారు. ఫలితంగా టోన్కిన్ జలసంధి వియత్నాంకు దక్కింది. అప్పటినుంచీ అది ‘నైన్ డాష్ లైన్’గా ఉన్నా తూర్పు చైనా సముద్ర ప్రాంతంవైపు విస్తరిస్తూ, జపాన్ గుండెల్లో గుబులు రేపుతూ మరో గీత పడింది. అది వేరే వివాదం. ఇలా యాజమాన్య హక్కుల్ని దఖలుపరుచుకోవడం తప్ప చైనా ఆ ప్రాంత దీవులను పెద్దగా పట్టించుకోలేదు. రక్షణపరంగా, ఇంధన నిక్షేపాల పరంగా వాటి ప్రాధాన్యత తెలియకపోవడమే ఇందుకు కారణం. 70వ దశకంలో పరిస్థితి మారింది. పారాసెల్ దీవులనుంచి దక్షిణ వియత్నాం నావికాదళాన్ని చైనా వెళ్లగొట్టింది. స్ప్రాట్లీ దీవుల్లో దాదాపు 200 ప్రాంతాలను అనంతరకాలంలో స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ దీవులు తమవంటే తమవని ఎవరికి వారు వాదిస్తున్నారు. ఈ వివాదంలో తైవాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఇండొనేసియా దేశాలు తమ తమ భూభాగాల వైపున్న దీవులు తమవేనంటున్నాయి. ఫిలిప్పీన్స్ చేస్తున్న వాదనలో హేతుబద్ధత లేకపోలేదు. ఈ గీతలు కొన్నిచోట్ల చైనా ప్రధాన భూభాగానికి 2,000 కిలోమీటర్ల దూరానికి కూడా విస్తరించి ఉన్నాయని, ఆధునిక కాలంలో ఇది ఏ రకంగా న్యాయమని ఆ దేశం ప్రశ్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి సముద్ర జలాల ఒప్పందం ప్రకారం ఒక దేశ ప్రధాన భూభాగం నుంచి నిర్దిష్టమైన దూరాన్ని లెక్కేసి ఆ మేరకే ఆ దేశ సరిహద్దు జలాలను నిర్ణయిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తమ సేనలు జపాన్ సైన్యాన్ని ఓడించి స్వాధీనం చేసుకున్న దీవులు గనుక చట్టపరంగా కూడా తమకు తిరుగులేని హక్కులున్నాయన్నది చైనా వాదన. అలాగని అది ‘నైన్ డాష్ లైన్’ గురించి ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. దాన్ని వివరించి చెబితే తన వాదన చెల్లకుండా పోతుందన్న భయం దీని వెనక ఉండొచ్చు. అందుకు బదులు ఫిలిప్పీన్స్ ఫిర్యాదు చేసింది మొదలుకొని ఈ కేసులో సాగుతున్న పరిణామాలపై అది గుర్రుగా ఉంది. నియమావళి ప్రకారం అంతర్జాతీయ సాగర జలాల న్యాయ ట్రిబ్యునల్ (ఐటీఎల్‌ఓఎస్) అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే ఒక సమస్యపై ఏర్పడే ట్రిబ్యునల్ సభ్యుల పేర్లు సూచించాలి. ఫిలిప్పీన్స్ ఫిర్యాదు చేసే సమయానికి ఆ పదవిలో ఉన్న జపాన్‌కు చెందిన న్యాయమూర్తి సభ్యులను ప్రకటించారు. తూర్పు చైనా సముద్రంలో తమకూ, జపాన్‌కూ మధ్య విభేదాలున్న నేపథ్యంలో ఆయన ఆ పని చేయకూడదని చైనా వాదిస్తోంది. ఇంతకూ వివాద పరిష్కార ట్రిబ్యునల్ అంతర్జాతీయ ఒప్పందంలో ఏముందో, ఆ నియమావళి అంతరార్ధమేదో చెప్పడం...దాని ప్రకారం ఎవరి వాదన తప్పో తేల్చడం తప్ప ఒక ప్రాంత దీవులపై సార్వభౌమాధిపత్యం ఎవరిదన్న అంశం జోలికి పోలేదు. సముద్ర జలాల సరిహద్దు వివాదాలు దాని పరిధిలోకి రావు. అందువల్లే ఇతర అంశాలపై ట్రిబ్యునల్ దృష్టి కేంద్రీకరించింది. దీవుల్లో చైనా కార్యకలాపాలవల్ల ఫిలిప్పీన్స్ హక్కులకు భంగం కలగడంతోపాటు ఆ ప్రాంత పర్యావరణానికి విఘాతం కలుగుతున్నదని తేల్చిచెప్పింది. ముఖ్యంగా సముద్ర జీవులకు ఆ కార్యకలాపాలు హానికరంగా పరిణమించాయని అభిప్రాయపడింది. ఈ తీర్పు తమకున్న హక్కులపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని చైనా స్పందించడాన్నిబట్టి ఈ ప్రాంతంలో రాగలకాలంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందో సులభంగానే అంచనా వేయొచ్చు. ప్రస్తుత తీర్పు వివాదానికి పరిష్కారం కాకపోగా కొత్త ఘర్షణలకు తెరలేపడం ఖాయం. ఆ ప్రాంతంలోని తమ సహచర దేశాలకు అండగా ఉంటామని ‘అన్నివిధాలా’ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత్‌కంటూ సొంత ప్రయోజనాలు లేవు. అయితే ఆ వివాదంలో మన వైఖరి హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును నిలువరించడానికి మనకు తోడ్పడుతుంద న్నది నిపుణుల అంచనా. ఏదేమైనా హేగ్ ట్రిబ్యునల్ తీర్పు అడ్డుపెట్టుకుని చైనాను కట్టడి చేయాలన్న అమెరికా వ్యూహం...పర్యవసానంగా ఏర్పడే ఉద్రిక్తతలు భవిష్యత్తులో ఆసియా తీరుతెన్నులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.