అమెరికా విమానానికి అత్యంత సమీపానికి వెళ్లిన చైనా ఫైటర్ జెట్
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాలపై దాదాపుగా ఢీ కొట్టబోయింది. చైనా జెట్ అత్యంత ప్రమాదకరంగా దూసుకు రావడంతో అమెరికా నిఘా విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పుని తప్పించారు. ఇది డిసెంబర్ 21న జరిగిందని అమెరికా ఇండో ఫసిఫిక్ కమాండ్ వెల్లడించింది.
‘‘అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ–135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే–11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల (20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది’’ అంటూ నిందించింది. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది.
దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చినా డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అమెరికా యుద్ధ విమానాలను, నౌకలను మోహరిస్తూ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించడం దానికి మింగుడు పడడం లేదు. అమెరికా తన నిఘా కార్యకలాపాలతో చైనాకు పెనుముప్పుగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment