ప్రసంగిస్తున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(ఫొటో కర్టెసీ: గ్లోబల్ టైమ్స్)
బీజింగ్: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీయకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత ఉందని డ్రాగన్ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. సినో- ఇండియా బార్డర్‌లో తామెప్పుడూ సుస్థిరతకే ప్రాధాన్యం ఇస్తామని, ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భారత్‌తో సామరస్యపూర్వక చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ‘‘ఇటీవల కాలంలో చైనా- భారత్ సంబంధాలపై అన్ని వర్గాలకు ఆసక్తి పెరిగింది. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులు చేయి దాటిపోయేలా చైనా ఎన్నడూ ముందడుగు వేయలేదు. సరిహద్దుల్లో సుస్థిరత నెలకొల్పాలనే నిబద్ధతతో ఉంది. అయితే మా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. రక్షణ కవచంలా నిలబడతాం. (చదవండి: మళ్లీ చైనా దుస్సాహసం)
ఇంకొక విషయం ఏమిటంటే.. చైనా- భారత్ మధ్య సరిహద్దులు నిర్ణయించబడలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్రిక్తతలు ఘర్షణలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదు. అదే ఇరు దేశాలకు శ్రేయస్కరం. డ్రాగన్(చైనా), ఎలిఫెంట్(ఇండియా) తలపడితే 1+1=2 అవుతుంది. అదే అవి రెండూ కలిసి డ్యాన్స్ చేస్తే 1+1=11 అవుతుంది. మరో ఉదాహరణ చెబుతాను. విభేదాలు పక్కనబెట్టి ఇరు దేశాధినేతలు పరస్పర ప్రయోజనాల గురించి ఆలోచిస్తే 2.7 బిలియన్ మంది ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగుతారు.
ఇరు దేశాలు అభివృద్ధి చెందడంతో పాటుగా సత్పంబంధాల కారణంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. భారత్‌తో బంధం బలోపేతం చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది’’ అని వాంగ్ యీ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్యారిస్‌లోని ప్రఖ్యాత ఫ్రెంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో సోమవారం ప్రసగించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది. కాగా తూర్పు లదాఖ్, పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా ఆర్మీ బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడిందని భారత్ ప్రకటన విడుదల చేసిన కొద్దిసేపటికే వాంగ్ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: భారత్ – చైనాలే ఆశాదూతలు! )
Comments
Please login to add a commentAdd a comment