బీజింగ్: పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీర భాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులును చూశాం. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం భార్యతో హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ వివరాలు.. చైనా జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసు ఉన్న బాబు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను.. తండ్రికి కొడుకు బాధ్యతలను అప్పగించింది.
ఉద్యోగం చేస్తున్న తండ్రికి చిన్నారి బాధ్యతలు చూడటం ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తిని కోరారు. కానీ రెండో భార్య అందుకు అంగీకరించలేదు. బిడ్డ ఎప్పటికైనా తనకు అడ్డంకే అని భావించిన ఆ వ్యక్తి ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు. బిడ్డను అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కొడుకును తీసుకువచ్చాడు. కన్నతల్లి బాబుని చూడాలని కోరింది.. అందుకే తీసుకెళ్తున్నాను అని కుటుంబ సభ్యులకు తెలిపాడు.
అది నమ్మిన కుటుంబ సభ్యులు బాబును తండ్రికి అప్పగించారు. కానీ ఆ ప్రబుద్ధుడు ఏ మాత్రం జాలీ, దయ లేకుండా రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు అమ్మేశాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్ చేయసాగాడు. ఇక బాబును తల్లి దగ్గరికి తీసుకెళ్లి వారం రోజుల పైనే అవుతుంది. ఇంకా తిరిగి తీసుకురాకపోవడంతో.. బాబు తండ్రికి కాల్ చేశారు అతడి కుటుంబ సభ్యులు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో కన్నతల్లికి కాల్ చేసి బిడ్డ గురించి అడగ్గా ఆమె తన దగ్గరకు తీసుకురాలేదని తెలిపింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయగా.. సదరు వ్యక్తి బాబును అమ్మకానికి పెట్టి.. వచ్చిన డబ్బుతో కొత్త భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లినట్లు తెలిసింది. దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చైనాలో ఇలాంటి సంఘటలను తరచుగా చోటు చేసుకుంటాయి. గతేడాది ఓ వలస కూలీ అప్పుడే పుట్టిన బిడ్డను 17.74 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. మరో 19 ఏళ్ల కుర్రాడు ఐఫోన్ కోసం నవజాత శిశువును అమ్ముకున్నాడు.
చదవండి: నవ దంపతులకు హనీమూన్ కష్టాలు!
Comments
Please login to add a commentAdd a comment