బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ ఎన్నిక లాంఛనమే కానున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ చైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల ఫలితం పూర్తిగా తేలిన తర్వాతే ఈ విషయంపై స్పందిస్తామని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో విజయం తనదేనని మిస్టర్ బైడెన్ ప్రకటన చేశారు. అయితే మాకు తెలిసినంత వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం అన్నది ఆ దేశ చట్టాల ప్రకారమే వెలువడుతుంది. ఏదేమైనా నూతన ప్రభుత్వంతో మాకు సత్సంబంధాలే కొనసాగుతాయని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే సాధించి మ్యాజిక్ ఫిగర్(270) దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక చతికిలపడ్డ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.(చదవండి: ట్రంప్ ఓటమి భారత్‌కు మంచిదేనా!?)
ఇక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న ఆయన.. ‘‘ వీళ్లంతా పెద్ద దొంగలు. యంత్రాలన్నీ అవినీతిమయమయ్యాయి. ఇదొక స్టోలెన్ ఎలక్షన్. గత రెండు వారాలుగా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. మన దేశానికి కాబోయే అధ్యక్షుడు ఎవరో ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రకటనలు చూస్తూనే ఉన్నాం’’ అంటూ ట్విటర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ మరో రెండు నెలల పాటు శ్వేతసౌధంలో ఉండనున్న తరుణంలో, అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు బైడెన్‌ను ఇరకాటంలో పెట్టేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. చైనాపై అగ్గిమీద గుగ్గిలం అయ్యే ట్రంప్, బైడెన్‌ను ఆత్మరక్షణలోకి పడవేసేలా, అదే సమయంలో డ్రాగన్ దేశానికి చుక్కలు చూపే విధంగా దూకుడు ప్రదర్శిస్తారని పేర్కొంటున్నారు. కాగా రష్యా, మెక్సికో సైతం ఇంతవరకు బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment