బీజింగ్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. తాలిబన్లు తమతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. అఫ్గనిస్తాన్ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయం అందిస్తామని డ్రాగన్ దేశం సోమవారం వెల్లడించింది. కాగా అమెరికా బలగాలు అఫ్గన్ గడ్డ నుంచి వెనుదిరిగినప్పటి నుంచి చైనా.. తాలిబన్లతో సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.
వీగర్ ముస్లింలను అణచివేసేందుకే..
జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలపై చైనా దాష్టీకం గురించి ఇప్పటికే పలువురు జర్నలిస్టులు బయటి ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైనార్టీ వర్గంపై జిన్‌పింగ్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చైనా ఆగడాలను తట్టుకోలేక ఇతర దేశాలకు పారిపోయిన వీగర్ల నోరు నొక్కేలా జిన్‌జియాంగ్‌లో ఉన్న వారి బంధువులను, కుటుంబ సభ్యులను వేధిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజం తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్‌తో సుమారు 76 కిలో మీటర్ల మేర సరిహద్దు పంచుకుంటున్న చైనా... జిన్‌జియాంగ్ వేర్పాటువాదులు, దేశం విడిచి పారిపోవాలనుకుంటున్న వీగర్ ముస్లింలకు అఫ్గన్ గమ్యస్థానం అవుతుందని భావిస్తోంది. దీంతో.. తాలిబన్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా వారి ప్రయత్నాలను తిప్పికొట్టవచ్చనే యోచనలో ఉంది. ఈ క్రమంలో తాలిబన్ ముఖ్యనేతల బృందం గత నెలలో.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీవ్రవాదులను తమ దేశంలోకి రానివ్వమని డ్రాగన్ దేశానికి మాట ఇచ్చారు. ఇందుకు ప్రతిగా.. తమ దేశ పునర్నిర్మాణానికి మద్దతుగా నిలవాలని మంత్రిని కోరారు.
అఫ్గాన్ ప్రజల హక్కు అది: చైనా
ఇక ఆదివారం తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచుకున్న నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ మాట్లాడుతూ.. ‘‘మేం దీనిని పూర్తిగా స్వాగతిస్తున్నాం. స్వత్రంత్రంగా జీవించడం, వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్న అఫ్గన్ ప్రజల హక్కు, నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అఫ్గనిస్తాన్ అభివృద్ధికై ఆ దేశంతో స్నేహపూర్వక, సహకార సంబంధాలు కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.
అదే విధంగా కాబూల్‌లో ఉన్న తమ రాయబార కార్యాలయ కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. కాగా అఫ్గనిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా అండగా నిలిచిన నేపథ్యంలో.. చైనా ఈ మేరకు తాలిబన్లను మద్దతు పలకడం గమనార్హం. ఇక అమెరికా బలగాలు అఫ్గన్ నుంచి ఉపసంహరించుకున్న నాటి నుంచి తాలిబన్లు వరుస దాడులకు పాల్పడుతూ.. ఎట్టకేలకు దేశాన్ని ఆక్రమించుకుని.. అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చేశారు. అయితే, అంతర్జాతీయ సమాజానికి తమ వల్ల ఎలాంటి హాని ఉండదని, ప్రతీకార చర్యలకు దిగబోమని ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment