బీజింగ్: చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ నిషేధం వ్యవహారంలో అమెరికా- చైనా మధ్య వివాదం మరింత ముదురుతోంది. అమ్మకమా, నిషేధమా తేల్చుకోమంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సెప్టెంబరు 15 వరకు గడువు విధించారు. అంతేకాదు టిక్ టాక్ అమ్మకపు ఒప్పందంలో కొంత భాగం తమ ప్రభుత్వానికి రావాలని కూడా ట్రంప్ మెలిక పెట్టారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవోతో ఫోన్ ద్వారా చర్చించినట్టు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో డైలీ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన సంపాదకీయం ఆసక్తికరంగా మారింది. అమెరికా బెదిరింపులకు లొంగేదిలేదంటున్న చైనా తాజా వార్నింగ్ మరింత అగ్గి రాజేస్తోంది. (టిక్‌టాక్ : ట్రంప్ తాజా డెడ్‌లైన్)
టిక్‌టాక్ విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సాగనీయమని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక వార్తాపత్రిక డైలీ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. టిక్‌టాక్ ‘చోరీ’కి అమెరికా యత్నిస్తోందని, దీన్ని అంగీకరించ బోమని హెచ్చరించింది. తమ టెక్నాలజీ కంపెనీలను చేజిక్కించుకోవడానికి అమెరికా యత్నిస్తోందనీ, దీన్ని ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేసింది. అంతేకాదు ట్రంప్ సర్కార్ తీసుకోబోయే ప్రణాళికబద్ద ఆక్రమిత చర్యలపై ప్రతిస్పందించడానికి తమ దగ్గర చాలా మార్గాలున్నాయని కూడా పేర్కొంది. కాగా అమెరికాలోని టిక్‌టాక్ ఆపరేషన్స్ ని కొనుగోలు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నామని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment