వరుస గృహ హింస కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో చైనాలో యువత పెళ్లంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి హింసాత్మక పెళ్లిళ్లు అవసరమా? అనే ప్రశ్నలు యువతలో తలెత్తుతున్నాయని చైనా మీడియాకి చెందిన ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల షాన్డాంగ్ ప్రావిన్స్‌లో భార‍్యను భర్త హింసాత్మకంగా చంపిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది.
షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఓ భర్త తన భార్యను అతి క్రూరంగా హత్య చేశాడు. కారుతో తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు. బాధితురాలు బతికే ఉందని తెలుసుకుని.. మరలా కారును ఆమెపై నుంచి పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త చైనా అంతటా వ్యాపించింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. కుటుంబ కలహాలతోనే 37 ఏళ్ల భర్త తన 38 ఏళ్ల భార్యను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు ముందు మరో రెండు గృహ హింస కేసులు చైనాలో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనల్లో నిందితులు ప్రదర్శించిన క్రూరత్వం సర్వత్రా ప్రజలను భీతికొల్పే స్థాయిలో ఉంది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్య, మరదలిని కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎన్నో ఏళ్లుగా గృహ హింస అనుభవిస్తున్న మహిళ.. విడాకులను కోరింది. ఈ క్రమంలో దాడి చేశాడు భర్త.
చెంగ్డు ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. విడాకులను కోరిన భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ఎనిమిది రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. వారి రెండేళ్ల కాపురంలో భర్త తనపై 16 సార్లు దాడి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలు చైనా ప్రజలకు పెళ్లిపై ఎన్నో ప్రశ్నలను మిగిలిస్తున్నాయని చైనా మీడియా ప్రచురించింది. పెళ్లంటేనే యువత భయపడే పరిస్థితి ఎదురయ్యే ఘటనలు జరగుతున్నాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో
Comments
Please login to add a commentAdd a comment