షాకింగ్‌.. జాక్‌ మా మిస్సింగ్‌?! | Chinese Billionaire Jack Ma Goes Missing after Controversial Speech | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. జాక్‌ మా మిస్సింగ్‌?!

Published Mon, Jan 4 2021 2:40 PM | Last Updated on Mon, Jan 4 2021 4:54 PM

Chinese Billionaire Jack Ma Goes Missing after Controversial Speech - Sakshi

బీజింగ్‌: చైనీస్‌ బిలియనీర్‌, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా కనిపించడం లేదట. చైనా విధానాలు, దేశీయ బ్యాంకు పాలసీల గురించి జాక్‌ మా బహిరంగంగా విమర్శలు చేసిన నాటి నుంచి ఆయన కనిపించడం లేదని సమాచారం. రెండు నెలల క్రితం జాక్‌ మా తన స్వంత టాలెంట్‌ షో ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ తర్వాత నుంచి పబ్లిక్‌గా కనిపించడం లేదని తెలిసింది. గతేడాది అక్టోబర్‌ 24న జాక్‌ మా షాంగైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనీస్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్‌ పని తీరు వల్ల దేశంలో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నాడు జాక్‌ మా తన ప్రసంగంలో ‘నేటి ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక యుగం నాటి పరిస్థితులకు వారసత్వంగా నిలుస్తుంది. భవిష్యత్‌ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త వ్యవస్థను రూపొందించుకోవాలి. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించాలి. యువతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి’ అన్నారు. (చదవండి: అలీబాబాను ఆదుకోని బైబ్యాక్‌ ప్లాన్‌)

జాక్‌ మా వ్యాఖ్యలు బీజింగ్‌ పాలనా యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదాస్పద ప్రసంగం అనంతరం యాంట్‌ గ్రూప్‌ పబ్లిక్‌ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్‌ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్‌ మార్కెట్‌ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తన సొంత టాలెంట్‌ షో చివరి ఏపిసోడ్‌ తర్వాత జాక్‌ మా బహిరంగంగా కనిపించలేదు. దాంతో ప్రస్తుతం అతడి భద్రత పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక టాలెంట్‌ షో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి జాక్‌ మా ఫోటోని తొలగించారు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇక జాక్‌ మా కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఆ సంస్థ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలని కొట్టి పారేయడం గమనార్హం. (చదవండి: జాక్‌ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్)

ఈ సందర్భంగా అలీబాబా గ్రూపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జాక్‌ మా మిస్సయ్యారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం. షెడ్యూల్‌లో ఏర్పడిన గందరగోళం వల్ల ఆయన ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌ షోలో కనిపించడం లేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం జాక్‌ మా స్థానంలో అలీబాబా గ్రూపు ఎగ్జిక్యూటివ్, లూసీ పెంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆఫ్రికాస్‌ బిజినేస్‌ హీరోస్‌ షో కంటెస్టెంట్‌ ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘జాక్‌ మాకు సంబంధించి చైనాలో ఏదో జరుగుతుంది. త్వరలోనే ఆ విషయాలు వెలుగులోకి వస్తాయి’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement