
ఖాతాలో 280 డాలర్లకు బదులు 81 ట్రిలియన్ డాలర్లు జమ
అమెరికాలో గతేడాది సిటీ బ్యాంకు సిబ్బంది తప్పిదం
పొరపాటును గుర్తించి సొమ్మును వెనక్కి రప్పించిన అధికారులు
వాషింగ్టన్: కేవలం 280 డాలర్లు (రూ.24,478) జమ చేయాల్సిన బ్యాంకు ఖాతాలో ఏకంగా 81 ట్రిలియన్ డాలర్లు(రూ.7,081,00000,0000000) జమ చేస్తే? సదరు ఖాతాదారుడు క్షణాల్లో కుబేరుడైపోతాడు. చిన్న చిన్న దేశాలనే కొనేసే స్థోమత వచ్చేస్తుంది. సాక్షాత్తూ కుబేరుడికే అప్పులు ఇచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ, ఇక్కడ ఆ ఖాతాదారుడికి అంత భాగ్యం దక్కలేదు. అతడి కుబేరుడి హోదా 90 నిమిషాల్లోనే మటుమాయమైపోయింది.
అమెరికాలో సిటీగ్రూప్ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన సిటీ బ్యాంకు సిబ్బంది గత ఏడాది ఏప్రిల్‌లో ఒక కస్టమర్ బ్యాంకు ఖాతాల్లో 280 డాలర్లకు బదులు ఆన్‌లైన్‌లో పొరపాటున 81 ట్రిలియన్ డాలర్లు జమచేశారు. ఇదంతా ఇద్దరు ఉద్యోగుల నిర్వాకం. తాము చేసిన తప్పును వారు గుర్తించలేకపోయారు. కానీ, మరో ఉద్యోగి 90 నిమిషాల్లో గుర్తించాడు. వెంటనే బ్యాంకు అధికారులకు అప్రమత్తం చేయడంతో సదరు లావాదేవీ ‘రివర్స్’అయిపోయింది. బ్యాంకు సొమ్ము భద్రంగా తిరిగి వచ్చేసింది.
ఖాతాల్లో ఎక్కువ సొమ్మును జమ చేయడం లాంటి పొరపాట్లను బ్యాంకింగ్ పరిభాషలో ‘నియర్ మిస్’అంటారట! భారీ మొత్తంలో సొమ్ము ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ అయితే హెచ్చరించే డిటెక్టివ్ కంట్రోల్ వ్యవస్థ బ్యాంకుల్లో ఉంటుంది. సిటీ బ్యాంకులో జరిగిన రూ.7,081 లక్షల కోట్ల లావాదేవీని ఈ వ్యవస్థ కనిపెట్టినట్లు సదరు బ్యాంకు ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన వల్ల తమ బ్యాంక్‌కు గానీ, ఖాతాదారులకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. సిటీ బ్యాంక్‌లో 2024లో 10 ‘నియర్ మిస్’ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక బిలియన్ డాలర్ల(రూ.8,740 కోట్లు) సొమ్ము పొరపాటున ఖాతాల్లోకి వెళ్లిపోయింది. 2023లో అయితే 13 నియర్ మిస్ ఘటనలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment