వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఈనెల 15న జరగాల్సిన రెండో ముఖాముఖి చర్చను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ప్రకటించింది. ఈ డిబేట్ ఆన్‌లైన్‌లో జరపాలని కమిషన్ భావించగా, ట్రంప్ ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. ఇలాంటి వర్చువల్ డిబేట్‌తో సాధించేది శూన్యమని, తాను ఇందులో పాల్గొననని చెప్పారు. దీంతో డిబేట్‌ను ఏకంగా రద్దు చేయాలని కమిషన్ నిర్ణయించింది. మరోవైపు ఈ సమయంలో బైడెన్ ఏబీసీ న్యూస్ నిర్వహించే టౌన్‌హాల్ ముఖాముఖిలో పాల్గొననున్నారు. ట్రంప్ పబ్లిక్‌లో తిరగవచ్చని డాక్టర్లు చెప్పినా డిబేట్‌ను ముఖాముఖి నిర్వహించకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించాలనడం సబబు కాదని ట్రంప్ బృందం విమర్శించింది.
కావాలంటే డిబేట్లను వాయిదా వేయాలని సూచించింది. కానీ తన నిర్ణయం మార్చుకునేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎట్టిపరిస్థితుల్లో ముఖాముఖి డిబేట్ నిర్వహించమని తేల్చిచెప్పింది. ఇరు అభ్యర్థుల మధ్య మూడో డిబేట్ ఈ నెల 22న జరగాల్సి ఉంది. వైట్‌హౌస్‌లో ప్రజలతో ములాఖత్ అవ్వాలని ట్రంప్ నిర్ణయించారు. కరోనా సోకిన అనంతరం ఇలా ప్రజలను ట్రంప్ కలవడం ఇదే తొలిసారి. ప్రెసిడెంట్ శనివారం వైట్‌హౌస్ సౌత్ లాన్స్‌లో దేశంలో శాంతిభద్రతల కోసం శాంతియుత నిరసనను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఓటర్లు ప్రశ్నలడిగే కీలక డిబేట్‌లో పాల్గొనకపోవడం ట్రంప్‌నకు సిగ్గు చేటని బైడెన్ విమర్శించారు. ట్రంప్ వైఖరి కొత్తేమీ కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment