
లండన్ : వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్ బాటిల్స్ చూశాం.. వాడుతున్నాం కూడా. కానీ గాలి బాటిల్స్(గాలితో నింపిన) గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు కదా. అయితే ఇది చదవండి. యూకేలోని ఓ కంపెనీ ఈ వినూత్న ఆలోచన చేసింది. హోమ్‌సిక్ ఫీలవుతున్న వారి కోసం ఈ గాలి బాటిళ్లని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. హోమ్‌సిక్‌కి, ఈ గాలి బాటిల్‌కి సంబంధం ఏంటో ఆ కంపెనీ మాటల్లోనే వినండి.. ‘కొత్త కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇక మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే చాలా దేశాలు ప్రయాణాలపై బ్యాన్ విధించాయి. దాంతో చాలా మంది ఇంటికి దూరంగా విదేశాల్లో చిక్కుకుకుపోతున్నారు. రోజుల తరబడి ఇలా స్వస్థలానికి దూరంగా ఉంటే ఇంటి మీద బెంగ పెట్టుకుంటారు. ఇంటి వాసనను మిస్ అవుతారు. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి ప్రాంతానికే చెందిన గాలిని ఇలా బాటిళ్లలో నింపి వారికి అందిస్తాం. ఇక ఇల్లు గుర్తుకొచ్చిన ప్రతి సారి ఈ గాలి వాసనను పీల్చితే.. ఇంటి మీద బెంగ తీరుతుంది’ అని తెలిపింది. (చదవండి: కొబ్బరి నూనె... బుల్లెట్ కాఫీ.. )
‘ఇక దీనిలో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన గాలిని 500 మిల్లిలీటర్లు, లీటరు బాటిళ్లలో నింపుతాం. సొంత ఊరి గాలి పీల్చాలని భావించే వారు ఆర్డర్ చేస్తే వారికి ఈ బాటిల్స్‌ని డెలివరి చేస్తాం. ఇక ఆఫ్ లీటర్ గాలి బాటిల్ ధర వచ్చి 33 అమెరికన్ డాలర్లు (2,434 రూపాయలు) మాత్రమే’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నుంచి "ప్రామాణికమైన" గాలి బాటిళ్లను విక్రయిస్తోంది. విదేశాలలోని యూకే నివాసితులకు ఇంటి సువాసనను అందిస్తుంది. ఇక దీన్ని ఎలా వాడాలి అంటే బాటిల్ మీద కార్క్ స్టాపర్ ఉంటుంది. ఇంటి మీదకు ధ్యాస మళ్లితే.. దాన్ని తీసి.. ఆ వాసనలు పీల్చితే సరి. ఇక కస్టమర్ అభ్యర్థనల మేరకు దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన గాలిని అయినా సరే ఇలా బాటిల్‌లో నింపి డెలివరి చేస్తాం అంటుంది సదరు కంపెనీ.
ఇక ఇప్పటికే కెనడియన్ కంపెనీ విటాలిటీ ఎయిర్ రాకీ పర్వతాల తాజా గాలిని చైనా కొనుగోలుదారులకు అందిస్తుంది. రెండు 8 లీటర్ బాటిల్స్ ధర వచ్చి 52.99 డాలర్లు(4,129.97 రూపాయలు). ఇక మరో స్విస్ కంపెనీ స్విస్‌బ్రీజ్ సెంట్రల్ యూరోపియన్ దేశాల గాలిని 20 డాలర్లకి(1,475 రూపాయలు)విక్రయిస్తుంది. మొత్తానికి ఈ గాలి బాటిళ్ల వ్యాపారం బావుంది కదా.
Comments
Please login to add a commentAdd a comment