Conflicts Between NATO And Ukraine - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ డిమాండ్‌తో బిత్తరపోయిన నాటో దేశాలు.. శ్రుతి మించితే ఖబర్దార్‌ అంటున్న పుతిన్‌

Published Wed, Feb 15 2023 4:36 AM | Last Updated on Wed, Feb 15 2023 9:06 AM

Conflicts Between NATO And Ukraine - Sakshi

అబ్రహం ట్యాంకు

దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 
ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో నాటో దేశాల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయా? ఉక్రెయిన్‌ మరో అఫ్గానిస్తాన్‌గా మారుతుందేమోననే అనుమానాలు నాటో కూటమిలో కలుగుతున్నాయా? ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న సంప్రదాయక యుద్ధం ముదిరి నాటో దేశాలు కూడా ప్రభావితమై భీకర యుద్ధంగా మారుతుందా? ఉక్రెయిన్‌ పద్మవ్యహంలో పీకల దాకా చిక్కుకుపోయామనే సందేహం నాటో దేశాల అధినేతల్లో మొదలవుతోందా?

ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు సరఫరా చేసే విషయంలో నాటో కూటమిలో చెలరేగిన పొరపొ చ్చాలను గమనిస్తే కూటమి మధ్య స్నేహ సంబంధాలు సజావుగా సాగడం లేదని అర్థం అవుతోంది. ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో తామంతా ఒక్కతాటిపై ఉన్నట్లు పైకి చెబుతున్నా నాటో దేశాధినేతల మధ్య అనేక అంశాలపై విభేదాలు ఉన్నట్లు బయటపడింది. 

ఒత్తిడికి తలొగ్గిన అగ్రరాజ్యం... 
నాటో కూటమిలో విభేదాలు తలెత్తే పరిస్థితులను గమనించి అమెరికా తలొగ్గక తప్పలేదు. ఉక్రెయిన్‌ బెటాలియన్‌కు సరిపడా 31 అబ్రహం ట్యాంకులను పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అయిష్టంగానే అంగీకరించారు. ఆ వెంటనే జర్మనీ సహా ఇతర యూరప్‌ దేశాలన్నీ తమ వద్ద ఉన్న లెపర్డ్‌–2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ప్రకటించాయి. నాటో కూటమిలో చీలికలు తప్పవ­ని ఎదురుచూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు జరుగుతోంది రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కాదని... అమెరికా తెరవెనుక ఉండి నిర్వహిస్తున్న యుద్ధమని అమెరికాలోని రష్యా దౌత్యవేత్త అనతోలి టానోల్‌ వ్యాఖ్యానించారు.  


లెపర్డ్‌–2  

యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్‌ పట్టు
సుదీర్ఘ చర్చలు, మంతనాల తర్వాత ఉక్రెయిన్‌కు ట్యాంకులు సరఫరా చేయడానికి నాటో కూటమి అంగీకరించిందో లేదో ఇప్పుడు తమకు యుద్ధవిమానాలు కూడా కావాలని ఉక్రెయిన్‌ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. భూతలంపై ఉన్న తమ సైనిక బలగాల రక్షణకు గగనతలంలో యుద్ధవిమానాల అవసరం ఉందని ఉక్రెయిన్‌ అధినేతలు నాటోను కోరుతున్నారు.

నాలుగో తరానికి చెందిన ఎఫ్‌16, యూరోఫైటర్స్, టోర్నడో, ఫ్రెంచ్‌ రఫేల్‌ యుద్ధవిమానాల అవసరాన్ని ఉక్రెయిన్‌ అధినేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రష్యా దగ్గర నాలుగోతరం యుద్ధవిమానాలు 772 ఉంటే తమ దగ్గర సోవియెట్‌ యూనియన్‌ నాటి పాతబడిన 69 విమానాలే ఉన్నాయని... వాటితో రష్యాను నిలువరించడం కష్టమని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ సలహాదారు యూరి సక్‌ చెబుతున్నారు.

ట్యాంకుల పంపిణీపై అంగీకారానికి రావాడానికి తల బొప్పికట్టి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న నాటో దేశాలు ఈ కొత్త డిమాండ్‌తో బిత్తరపోయాయి. ఎఫ్‌16 విమానాలను ఉక్రెయిన్‌కు కేటాయిస్తున్నారా అని ఓ విలేఖరి అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‘నో’అని ఒకమాటలో కొట్టిపారేశారు. ఇది అర్థంపర్థంలేని డిమాండ్‌ అని జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్‌ చేసిన వినతిపట్ల కొన్ని నాటో దేశాలు సానుకూలంగా స్పందించాయి.

ఎఫ్‌16 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్‌ అధికారికంగా కోరితే సానుకూలంగా పరిశీలిస్తామని నెదర్లాండ్‌ విదేశాంగ మంత్రి హొప్కి హోక్‌స్ట్రా అన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ కూడా తమ దేశ యుద్ధవిమానాలను ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధమన్నారు. లిథువేనియా అధ్యక్షుడు గిటినస్‌ న్యూసెథా కూడా సానుకూలంగా స్పందించారు. అయితే యుద్ధ విమానాల అంశం నాటో కూటమిలో మరోసారి విభేదాలకు దారితీయవచ్చని దౌత్యవేత్తలు అనుమానిస్తున్నారు.  

అసలు భయం ఇదీ.. 
రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన నాటో కూటమిలో ఆయా దేశాలు అందిస్తున్న సాయంపై అంతర్మథనం జరుగుతోంది. ఏడాదిపాటు రష్యా లాంటి అతిశక్తివంతమైన దేశాన్ని నిలువరించగలిగిన ఉక్రెయిన్‌... ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మరింత దూకుడుగా వెళ్లి యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళుతుందేమోనన్న అనుమానాలు కూటమి దేశాల్లో మొదలయ్యాయి. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా వంటి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్‌ ఉవ్విళ్లూరుతున్న విషయం ఆ దేశ నాయకుల ప్రకటనల్లో అర్థమవుతోంది.

నాటో అందిస్తున్న ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్‌ కనుక ఇలాంటి దుస్సాహసం చేస్తే అది యుద్ధం విస్తృతరూపం దాల్చడానికి దారితీస్తుందని అమెరికా, జర్మనీ వంటి దేశాలు భయపడుతున్నాయి. తామిచ్చే సాయం రష్యా దురాక్రమణలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్‌ ఉపయోగించుకోవాలని, ఇది శ్రుతి మించితే యుద్ధం తమ సరిహద్దుల వరకూ వచ్చే ప్రమాదం ఉందని నాటో దేశాలు ముఖ్యంగా రష్యా సరిహద్దుగా ఉన్న యూరప్‌ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంపై ఆయా దేశాల ప్రజల్లో కొంత అసహనానికి దారి తీస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్‌ కనుక తమ భూభాగాలను టార్గెట్‌ చేయడానికి ఉపయోగపడే యుద్ధవిమానాలు, క్షిపణి ప్రయోగ యంత్రాల వంటివి అందిస్తే నాటో హద్దు మీరుతున్నట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్‌ సహా రష్యా నేతలు హెచ్చరిస్తున్నారు. తమ పట్టణాలపై దాడి చేసే ఆయుధ సంపత్తిని నాటో గనక ఉక్రెయి­న్‌కు అందిస్తే తీవ్ర రూ­పంలో ప్రతిఘటిస్తామని... దీనివల్ల యుద్ధం స్వ­రూ­పం మారే ప్రమా­దం ఉందని రష్యా దౌత్యాధికారి గౌవ్‌రిలోవ్‌ హెచ్చ­రించారు. 

ట్యాంకులపై గొడవ
ఉక్రెయిన్‌ కోరిన యుద్ధ ట్యాంకులు అందించడంపై వారాల తరబడి సాగిన మంతనాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి నాటో దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఉక్రెయిన్‌కు సమీపాన ఉన్న యూరప్‌ దేశాలు ట్యాంకులు సరఫరా చేయాలని అమెరికా కోరుకుంది. అక్కడి భూ ఉపరితల పరిస్థితులకు ఐరోపా ట్యాంకులు సరితూగుతాయి కాబట్టి అయా దేశాలే ట్యాంకులు పంపిణీ చేయాలని అమెరికా వాదించింది.

కానీ యూరప్‌లోని నాటో దేశాలు ముఖ్యంగా జర్మనీ అందుకు అంగీకరించలేదు. నాటో కూటమి సభ్యుల మధ్య అధికారికంగా జరిగిన అనేక సమావేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. అమెరికా ముందుగా ట్యాంకులు పంపేందుకు ఒప్పుకుంటేనే తాము కూడా సిద్ధమవుతామని జర్మనీ తేగేసి చెప్పింది. అమెరికా తన దగ్గరున్న అధునాతన అబ్రహం ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందజేయడానికి అంగీకరిస్తేనే తాము లెపర్డ్‌–2 ట్యాంకులు ఇవ్వడానికి ఒప్పుకుంటామని జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ పట్టుబట్టారు.

అమెరికా భాగస్వామ్యం లేకుండా తాము ట్యాంకులు పంపితే రష్యా తన ఆగ్రహాన్ని తమపై గురిపెడుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యూరప్‌లోని నాటో దేశాలు స్పెయిన్, పోలాండ్, ఫిన్‌లాండ్, నార్వే తమ వద్ద ఉన్న లెపర్డ్‌–2 ట్యాంకులను పంపడానికి సిద్ధంగా ఉన్నా జర్మనీ అనుమతి లేకుండా వాటిని ఇతర దేశాలకు పంపకూడదన్న ఒప్పందాన్ని అనుసరించి ముందడుగు వేయలేని పరిస్థితి.

అబ్రహం ట్యాంకులు అత్యాధునికమైనవని, వాటిని ఉపయోగించడం కష్టసాధ్యమని, వాటి తయారీకి అనేక నెలలు పడుతుందని, రిపేర్లు చేయడం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని అమెరికా అధినేతలు బహిరంగంగా వాదిస్తూ వచ్చారు. పెంటగాన్‌ అధికారి కాలిన్‌ హెబ్‌ కాల్, అమెరికా జాతీయ భద్రతా దళ ప్రతినిధి జాన్‌ కిర్బి ఈ వాదనలు ముందుకు తెచ్చారు. అయినా కూడా జర్మనీ ససేమిరా అంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement