బ్రిటన్‌ విమానాలపై నిషేధం | Corona Effect: India Cancels Britain flights | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ విమానాలపై నిషేధం

Published Tue, Dec 22 2020 4:55 AM | Last Updated on Tue, Dec 22 2020 9:45 AM

Corona Effect: India Cancels Britain flights - Sakshi

ఫ్రాన్స్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేస్తున్నట్లు సూచిస్తూ ఇంగ్లాండ్‌లోని వారింగ్టన్‌ సమీపంలో రహదారిపై ఏర్పాటు చేసిన బోర్డు

లండన్‌/న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్‌ ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. కొత్త తరహా వైరస్‌ అదుపు చేయలేని స్థాయిలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్‌.. ఆదివారం నుంచి పౌరులపై అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించింది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మేట్‌ హన్‌కాక్‌ పేర్కొన్నారు. ‘ప్రజలంతా, ముఖ్యంగా టయర్‌ –4 ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్‌ తమకు కూడా సోకిందన్నట్లుగానే జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే దీన్ని నియంత్రించగలం’ అని విజ్ఞప్తి చేశారు. కొత్త రకం వైరస్‌ 70% వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది ఎక్కువ ప్రాణాంతకం అనేందుకు ఆధారాలేవీ లభ్యం కాలేదని, టీకాకు కూడా.. గత వైరస్‌తో పోలిస్తే వేరుగా స్పందిస్తుందనేందుకూ ఆధారాల్లేవని వివరించారు. ఉత్తర ఐర్లాండ్‌ మినహా బ్రిటన్‌ అంతటా ఈ వైరస్‌ను గుర్తించారు. ముఖ్యంగా లండన్, తూర్పు ఇంగ్లండ్, ఆగ్నేయ ఇంగ్లండ్‌ ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. 

అప్రమత్తంగా ఉన్నాం 
కొత్త తరహా వైరస్‌పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. కొత్త రకం వైరస్‌ ముప్పుపై సోమ వారం ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం వైరస్‌ ముప్పుపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇదంతా ఊహాజనితం. ఎక్కువగా ఊహించి భయాందోళనలకు గురికావద్దు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. ఆందోళన అవసరం లేదు’ అని హర్షవర్ధన్‌ వివరించారు.  

రాలేకపోతున్నారు.. 
బ్రిటన్‌ నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో అక్కడి నుంచి భారత్‌ రావాలనుకున్న పలువురు విద్యార్థులు, ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోనున్నారు. క్రిస్ట్‌మస్, నూతన సంవత్సర వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు భారత్‌ రావాలని యూకేలో చదువుకుంటున్న పలువురు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు టికెట్స్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో భారత్‌కు రాలేని పరిస్థితి ఏర్పడటంతో వారు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జనవరిలో ప్రారంభమయ్యే అకడమిక్‌ సెషన్‌లో జాయిన్‌ అయ్యేందుకు భారత్‌ నుంచి బ్రిటన్‌ రావాలనుకుంటున్న వారికి కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. విమానాలు రద్దు కావడంతో విమానయాన సంస్థలు కూడా టికెట్స్‌ను బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు తిరిగివ్వడం కానీ, ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అవకాశమివ్వడం కానీ చేస్తున్నాయి.  

ప్రాణాంతకం అనేందుకు ఆధారాల్లేవు
కరోనా కొత్త వేరియంట్‌ మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లభించలేదని భారతీయ అమెరికన్‌ ఆరోగ్య నిపుణుడు వివేక్‌ మూర్తి తెలిపారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ టీమ్‌లో వివేక్‌ మూర్తి సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. 

మహారాష్ట్రలో కర్ఫ్యూ 
కొత్త రకం కరోనా వైరస్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త గా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ కర్ఫ్యూ డిసెంబర్‌ 22 నుంచి జనవరి 5వ తేదీ దాకా అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. 

భారత్‌ సహా ప్రపంచ దేశాల ఆంక్షలు
తాజా వైరస్‌ ముప్పుపై స్పందించిన దేశాలు బ్రిటన్‌ నుంచి రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌ కూడా బుధవారం నుంచి డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. బ్రిటన్‌ నుంచి మంగళవారం అర్ధరాత్రి లోపు భారత్‌ వచ్చిన విమాన ప్రయాణికులకు ఆరీ్టపీసీఆర్‌ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు పంపిస్తామని విమానయాన శాఖ సోమవారం ప్రకటించింది. నెగటివ్‌గా నిర్ధారణ అయినవారు కూడా వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండా లంది. ప్రయాణానికి ముందు 72 గంటల లోపు పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రిపోర్ట్‌తో వచ్చిన ప్రయాణికులకు ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు, క్వారంటైన్‌లు లేకుండానే ఇంటికి పంపించేవారు.

ఈ మధ్యకాలంలో బ్రిటన్‌ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్‌ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. లాక్‌డౌన్‌ అనంతరం కొన్ని నెలలుగా బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, విస్టారా, ఎయిరిండియా, వర్జిన్‌ అట్లాంటిక్‌ సంస్థలు భారత్, బ్రిటన్‌ మధ్య విమాన సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. కెనడా, టర్కీ, బెల్జియం, ఇటలీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బల్గేరియా దేశాలు కూడా యూకే నుంచి విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఫ్రాన్స్‌ సహా పలు యూరోప్‌ దేశాలు బ్రిటన్‌తో సరిహద్దులను మూసేశాయి. హాంకాంగ్, ఇరాన్, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్‌ బ్రిటన్‌ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కొత్త ముప్పుపై చర్చించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ప్రత్యేకంగా భేటీ కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement