లండన్ : భారత్ సహా ప్రపంచంలోనే ఏ దేశం నుంచి వచ్చే వారికైనా కోవిడ్–19 నెగెటివ్ ధ్రువీకరణ తప్పనిసరి అని యూకే ప్రభుత్వం తెలిపింది. యూకేలోకి రావడానికి 72 గంటల ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలని స్పష్టం చేసింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను అరికట్టేందుకు యూకే ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ముందు జాగ్రత్తల్లో ఇది కూడా ఒకటి. కొత్త నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే తక్షణమే 500 పౌండ్ల జరిమానా విధిస్తామని ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇతర దేశాల నుంచి పడవ, రైలు, విమానాల ద్వారా వచ్చే ప్రయాణీకులెవరైనా 72 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోలేదని తేలితే దేశంలోకి అడుగుపెట్టనీయబోమని కూడా హెచ్చరించింది. హై రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి 10 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ తప్పనిసరి అని యూకే రవాణా శాఖ పేర్కొంది.
వీరు లొకేటర్ ఫారం కూడా పూర్తి చేయాలని తెలిపింది. బుధవారం నుంచి అమలవుతున్న లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో మరీ అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. అలాగే, యూకే నుంచి భారత్ సహా ఇతర దేశాలకు వెళ్లే వారు కూడా 72 గంటలు ముందు కోవిడ్ నెగెటివ్ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఇవే ఆంక్షలను అమలు చేయనున్నట్లు స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ కూడా ప్రకటించాయి. శుక్రవారం యూకేలో 68,053 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒకే రోజులో అత్యధికంగా 1,325 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,57,472కు చేరుకుంది. మరణాల సంఖ్య 79,833 కు చేరుకుంది. గురువారం నాటికి దేశంలో 15 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
కొత్త వేరియంట్ కేసుతో ఆస్ట్రేలియా అప్రమత్తం
మెల్‌బోర్న్: యూకే కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసు ఒకటి బ్రిస్బేన్‌లో నిర్థారణ కావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోనే మూడో అతిపెద్దదైన ఆ నగరంలో మూడు రోజుల లాక్‌డౌన్ విధించింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రయాణ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ శుక్రవారం తెలిపారు. కరోనా క్వారంటైన్ సెంటర్‌గా మారిన బ్రిస్బేన్‌లోని హోటల్‌లోని సిబ్బంది ఒకరికి యూకే వైరస్ వేరియంట్ సోకినట్లు నిర్థారణయింది. దీంతో స్థానిక క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 వరకు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బ్రెజిల్‌లో కోవిడ్ మరణాలు 2 లక్షలు పైనే..
సావోపౌలో: బ్రెజిల్‌లో కోవిడ్–19 ఒక వైపు తీవ్రం గా విజృంభిస్తుండగా కొత్త ఏడాది సందర్భంగా ప్రజలు సంబరాలు ముమ్మరం చేశారు. ఫలితంగా గడిచిన 24 గంటల్లో మరో 1,524 మంది కోవిడ్‌తో మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,00,498కు చేరుకుందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన రెండో దేశం బ్రెజిల్ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. చాలా దేశాలు కరోనా వ్యాప్తి చెందకుండా ఆంక్షలు అమలు చేస్తుండగా డిసెంబర్ 21నుంచి మొదలైన వేసవిని పురస్కరించుకుని బొల్సనారో ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. పార్టీలు, వినోద కార్యక్రమాలు పెరిగి వైరస్ వ్యాప్తి కూడా తీవ్రతరమైంది. అధ్యక్షుడు బొల్సనారో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా, మాస్క్‌లేకుండానే బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని విమర్శల పాలయ్యారు.
కొత్త స్ట్రైయిన్ కేసులు 82
న్యూఢిల్లీ: యూకే వేరియంట్ కరోనా వైరస్ కేసులు దేశంలో ఇప్పటి వరకు 82 వరకు వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. బాధితులందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాయని తెలిపింది. వారి దగ్గరి సంబంధీకులను కూడా క్వారంటైన్‌లో ఉంచామని పేర్కొంది. బాధితుల తోటి ప్రయాణీకులను, కుటుంబసభ్యులను, సన్నిహితంగా మెలిగిన వారిని కూడా గుర్తించి, పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వివరించింది.
ఆ ఫ్లైట్లు షురూ..
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)–భారత్ మధ్య ప్రయాణికుల విమానాల రాకపోకలు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడిన నేపథ్యంలో గత 16 రోజులుగా ఇరు దేశాల మధ్య ప్యాసింజర్ విమానాల రాకపోకలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ112 విమానం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు లండన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అలాగే విస్టారా విమానం శనివారం లండన్ నుంచి ఢిల్లీకి రానుంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా విమానాలు ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నాయి. జనవరి 8 నుంచి 23వ తేదీ వరకు యూకే–ఇండియా మధ్య కేవలం 30 విమానాలే రాకపోకలు సాగిస్తాయని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ ప్రకటించారు. ఇందులో యూకే విమానాలు 15, ఇండియా విమనాలు 15 ఉంటాయన్నారు. యూకే నుంచి భారత్‌కు విమానంలో ప్రయాణం చేసేవారు మూడు రోజుల ముందే కరోనా పరీక్ష చేయించుకోవాలని, నెగటివ్‌గా నిర్ధారణ అయితేనే ప్రయాణం కొనసాగించాలని, లేకపోతే విరమించుకోవాలని పేర్కొన్నారు.
మూడో వ్యాక్సిన్‌కూ అనుమతి
లండన్: కరోనాను ఎదుర్కోవడానికి ఏకంగా మూడో వ్యాక్సిన్‌కు కూడా యూకే అనుమతులు ఇచ్చింది. మోడెర్నా కంపెనీ తయారు చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్‌ను తమ దేశ సైంటిస్టులు పూర్తిగా పరిశీలించిన అనంతరం అనుమతులు ఇస్తున్నట్లు శుక్రవారం ఆ దేశ రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడమే తమ లక్ష్యమని రెగ్యులేటరీ అధికారి డాక్టర్ జూన్ రైజ్ అన్నారు. ఇప్పటికే 7 మిలియన్ల డోస్‌లకు ప్రీ ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే ఆయా డోసులు దేశానికి చేరుకోవడానికి మరొకొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. యూకే ఇప్పటికే ఆక్సఫర్డ్, ఫైజర్ టీకాలను ప్రజలకు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అనుమతుల ప్రకటనతో ఆ దేశంలో ఇవ్వనున్న మొత్తం టీకాల సంఖ్యమూడుకు చేరనుంది. ఫైజర్‌కు –75డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం కాగా, మోడెర్నాకు కేవలం –25డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సరిపోతుంది. దీంతో రవాణా సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment