రియో డీ జెనెరో: కరోనా వైరస్ బారిన పడిన 28 ఏళ్ల బ్రెజీలియన్ యువ డాక్టర్ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా రాద్ధాంతం చెలరేగుతోంది. రియో డీ జెనెరోకు చెందిన డాక్టర్ జోవా పెడ్రో రో ఫైటోసా కరోనా వైరస్ కారణంగా అనారోగ్యానికి గురై అక్టోబర్ 15వ తేదీన మరణించారు. అయితే ఆయన ఆస్ట్రాజెనేకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహిస్తోన్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారని, ఆ టీకా వికటించడం వల్ల డాక్టర్ మరణించారంటూ ముందుగా వార్తలు వెలువడ్డాయి. దాంతో పరిశోధకులు వెంటనే వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపి వేశారు.
వ్యాక్సిన్ కంటే కరోనా ప్రభావం నుంచి బయట పడేందుకు వాడిన మందుల వల్ల డాక్టర్ మరణించారని ట్రయల్స్ సన్నిహిత వర్గాలకు ఉటంకిస్తూ బ్రెజిల్ పత్రిక గ్లోబో, వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ తెలియజేసింది. రియో డీ జెనెరోలోని రెండు ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో డాక్టర్ జోవా గత మార్చి నెల నుంచి పని చేస్తున్నారు. ఆయన ప్రధానంగా కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆయన గతేడాదే వైద్య కళాశాలలో చదువు పూర్తి చేసుకొని వచ్చారని, కరోనా బారిన పడేంత వరకు ఆయన ఆరోగ్యం బాగుందని ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు గ్లోబో వార్తా పత్రికకు తెలియజేశారు.
డాక్టర్ జావో ఆస్పత్రిలో రోగుల నుంచి తన కరోనా వైరస్ సోకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఆయన వైరస్ బారిన పడినట్లు సావో పావ్లో ఫెడరల్ యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. ఆరోగ్యంగా ఉన్న యువ డాక్టర్ కరోనా కారణంగా పోవడం ఏమిటని కుటుంబ సభ్యులు, మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాము వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపి వేయడం లేదని, స్వతంత్ర కమిటీ కూడా తమకు ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బ్రెజిల్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ మూడవ ట్రయల్స్‌కు సహకరిస్తోన్న పావ్లో యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment