
లండన్: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్‌లో బుధవారం నుంచి అత్యంత కఠిన స్థాయి ఆంక్షలను(టయర్ 3) విధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. అకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి తాజాగా గుర్తించిన కొత్త తరహా కరోనా వైరసే కారణమని భావిస్తున్నారు. లండన్‌తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతినిధుల సభలో ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్‌కాక్ వివరించారు. ‘టయర్ 3’లో దాదాపు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌తో సమానమైన ఆంక్షలుంటాయి. ‘ఇక్కడ కొత్త తరహా కరోనా వైరస్‌ను గుర్తించారు.
ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా, వేగంగా పెరగడానికి ఈ కొత్త తరహా వైరస్ కారణం కావచ్చని భావిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని హాన్‌కాక్ పార్లమెంట్‌కు తెలిపారు. దాదాపు వెయ్యికి పైగా కేసుల్లో కొత్త వైరస్ వేరియంట్‌ను గుర్తించారని, అందులో అధికభాగం దక్షిణ ఇంగ్లండ్ ప్రాంతంలోనే నమోదయ్యాయని వివరించారు.
ఇప్పటికే బర్మింగ్‌హాం, మాంచెస్టర్ సహా పలు ప్రధాన నగరాల్లో టయర్ 3 ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, క్రిస్టమస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆంక్షల్లో స్వల్ప సడలింపు ఇవ్వాలని గత నెలలో యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఐదు రోజుల పాటు స్థానికంగా ఉండే మూడు కుటుంబాల వరకు కలుసుకుని పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment