భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్‌లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు.
క్రూయిజ్ షిప్‌లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్‌లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు.
రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్‌లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు.
ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్‌ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్‌లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు.
ఈ క్రూయిజ్ షిప్‌లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్‌లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్‌లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్‌బోర్డ్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది.
‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్‌లోని దాదాపు సగం క్యాబిన్‌లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్‌లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్‌లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు.
ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు!
Comments
Please login to add a commentAdd a comment