లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్‌ | Delivery Boy Eats Lady Customer Food And Messages Her About It In London | Sakshi
Sakshi News home page

లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్‌

Published Wed, Feb 10 2021 4:08 PM | Last Updated on Wed, Feb 10 2021 5:21 PM

Delivery Boy Eats Lady Customer Food And Messages Her About It In London - Sakshi

ఇల్లీ ఇలీస్

లండన్‌ : ఆన్‌లైన్‌ ద్వారా మీరు ఫుడ్‌ ఆర్డర్‌ చేసి దాని కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. పిచ్చ ఆకలి మీద ఉండి.. పదేపదే తలుపు వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ డోర్‌ బెల్‌ మోగిస్తాడా అని. మీరు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ దారిలో ఉంది... డెలివరీ బాయ్‌ మీకు దగ్గరలో ఉన్నాడు అంటూ నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి. రావాల్సిన ఫుడ్‌‌ రాలేదు. దానికి బదులు ‘‘ సారీ అండీ! మీరు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ నేను తినేశాను’’ అని డెలివరీ బాయ్‌నుంచి మెసేజ్‌ వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు?.. మామూలుగా అయితే కోపంతో ఊగిపోతారు. పుడ్‌ డెలివరీ కంపెనీకి ఫోన్‌ చేసి నిలదీస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఉద్యోగం పోయేలా చేసి ఆకలి చల్లార్చుకుంటారు. కానీ, బ్రిటన్‌కు చెందిన ఇల్లీ అనే యువతి మాత్రం అలా చేయలేదు. తన కడుపు మాడ్చిన డెలివరీ బాయ్‌ కడుపు కొట్టకుండా అతడు చేసిన పనికి నవ్వుకుని ఊరుకుంది. ( యజమానికి గుండెపోటు.. కుక్క ఏం చేసిందంటే? )

వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన ఇల్లీ ఇలీస్‌ అనే 21 ఏళ్ల యువతి గత శనివారం ఊబర్‌ ఈట్స్‌ యాప్‌లో రెండు బర్గర్లు, చిప్స్‌, చికెన్‌ వ్రాప్స్‌ ఆర్డర్‌ చేసింది. వాటి విలువ దాదాపు 1500 రూపాయలు. ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టిన కొద్దిసేపటి తర్వాత ‘ మీరు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ దారిలో ఉంది’ అని నోటిఫికేషన్‌ వచ్చింది. మరికొద్దిసేపటి తర్వాత ‘డెలివరీ బాయ్‌ మీకు దగ్గరలో ఉన్నాడు’ అని వచ్చింది. ఇల్లీ ఎంతో ఆత్రుతగా తను ఆర్డర్‌ చేసిన ఆహారం కోసం ఎదురుచూడసాగింది. ఏ క్షణంలోనైనా డోర్‌ బెల్‌ మోగవచ్చని తలుపువైపు చూడసాగింది. అయితే డెలివరీ బాయ్‌ ఆమె ఆశలు అడియాశలు చేశాడు. ‘సారీ లవ్‌! నేను నీ ఫుడ్‌ తినేశాను’ అని మెసేజ్‌ పెట్టాడు. దీంతో కంగుతిన్న ఆమెకు ఏం చేయాలో తెలియలేదు.

వెంటనే ఊబర్‌ ఈట్స్‌ యాప్‌ ఓపెన్‌ చేసి చూసింది. ఆహారం డెలివరీ అయినట్లు అందులో చూపించింది. ఊబర్‌ కంపెనీకి సదరు డెలివరీ బాయ్‌ మీద ఫిర్యాదు చేసి ఆహారాన్ని తిరిగిపొందే అవకాశం ఉన్నా ఆమె అలా చేయలేదు. దీనిపై ఇల్లీ మాట్లాడుతూ.. ‘‘ ఏమో! అతడికి నిజంగానే ఆకలిగా ఉన్నట్లుంది అందుకే తినేసుంటాడు. ఈ కరోనా కష్టకాలంలో అతడి ఉద్యోగం పోవటానికి నేను కారణం కాదల్చుకోలేదు. నాకెందుకో అదంతా కామెడీగా అనిపించింది. ఇలా నాకెప్పుడూ జరగలేదు. అతడి మెసేజ్‌తో నాకు నవ్వొచ్చింది. అందుకే అతడ్ని క్షమించేశాను’’ అని అంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement