
లండన్: ఫుడ్ డెలివరీ బాయ్‌ల నిర్వాకాలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు వచ్చాయి. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ని మార్గమధ్యలోనే ఒపెన్ చేసి తినడం వంటి వార్తలు గతంలో చాలా చూశాం. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసి.. వారు బుక్ చేసుకున్న ఆహారాన్ని తాను తినేశాడు. అది కూడా ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ ఇంటి బయటనే కూర్చుని దర్జగా లాగించేశాడు. సదరు కస్టమర్ డెలివరీ బాయ్ చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. వివరాలు.. లండన్ కెంటిష్ టౌన్‌లో నివాసం ఉంటున్న మహిళ స్థానిక మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇక దాన్ని ట్రాక్ చేస్తుండగా.. ఇంటి దాక వచ్చిన ఆర్డర్ సడెన్‌గా క్యాన్సిల్ అయ్యింది. తన ప్రమేయం లేకుండా ఆర్డర్ ఎలా క్యాన్సిల్ అయ్యిందని ఆలోచిస్తుండగా.. తన ఇంటి బయట మెక్‌డొనాల్డ్స్ డెలివరీ బాయ్ కూర్చుని.. ఫుడ్‌ని ఒపెన్ చేయడం చూసింది. (చదవండి: వూహాన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్)
అనుమానంతో తనకు పంపిన డెలివరీ బాయ్ నంబర్‌కు కాల్ చేయగా.. తన ఇంటి బయట ఉన్న వ్యక్తి ఫోన్ రింగవ్వటం.. అతడు కట్ చేయడం ఆమె గమనించింది. ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్ అక్కడే ఇంటి బయట కూర్చుని ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్‌ని సుబ్బరంగా లాగించేశాడు. ఈ తతంగం మొత్తాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోది. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా ఆహారం, సేవలతో కస్టమర్లు మనసు గెలుచుకోవాలనేది మా లక్ష్యం. ఇక ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే.. మాకు తెలియజేయండి. ఇలాంటి వాటిని మేం అస్సలు సహించం. ఇక ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment