
మాస్కో: వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రష్యాలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అక్కడ వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 669 మరణాలు నమోదైనట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో డెల్టా వేరియంట్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని తెలిపింది. స్థానిక అధికారుల లెక్కల ప్రకారం రష్యాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 55,14,599 కాగా, మరణాల సంఖ్య 1,35,214కి చేరింది. ఇదిలా ఉంటే, గత శుక్రవారం యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీకి(క్వార్టర్ ఫైనల్) ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఆ నగరంలో కోవిడ్ మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి.
రాజధాని మాస్కోలో కూడా పరిస్థితి ఆందోళనకరమైన నేపథ్యంలో అక్కడ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నగర వ్యాప్తంగా నమోదవుతున్న 90శాతం కోవిడ్ కేసులకు డెల్టా వేరియంటే కారణమని మాస్కో మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. కాగా, మంగళవారం కూడా రష్యాలో 20,616 కోవిడ్ కేసులు, 652 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యన్లందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ మరోసారి సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు రష్యాలో చాలా మంది వెనకాడుతున్న నేపథ్యంలో…ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తాను కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని పుతిన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment