ఓ పేద్ద డైనోసార్ వెంటపడుతోంది.. ముందు జీపులో ముగ్గురు వ్యక్తులు.. స్పీడుగా పోనీయ్ అంటూ భయంతో అరుస్తున్నారు.. డైనోసార్ ఇంకా వేగంగా దగ్గరికి వచ్చేసింది.. నోరు తెరిచి జీపులోని ఒకరిని అందుకోబోయింది.. సరిగ్గా అప్పుడే జీపు వేగం పెరిగింది.. వారు డైనోసార్ నుంచి తప్పించుకున్నారు. జురాసిక్ పార్క్–1 సినిమాలోని ఒళ్లు గగుర్పొడిచే సీన్ ఇది. అంతసేపూ ఊపిరిబిగబట్టి చూస్తున్న మనం కూడా ఒక్కసారిగా హమ్మయ్య అని రిలాక్స్ అవుతాం. ఆ సీన్‌లో జీపు వెంటపడే డైనోసార్ టి–రెక్స్. డైనోసార్లలో అన్నింటికన్నా ప్రమాదకరమైనది అది. మరి ఇప్పుడు నిజంగానే ఓ పెద్ద టీ–రెక్స్ కనిపించి మన వెంట పడిందనుకోండి. అప్పుడెట్లా.. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదంటున్నారు శాస్త్రవేత్తలు.
సినిమాలో టి–రెక్స్ అలా వేగంగా జీపు వెంటపడినట్టు చూపించారుగానీ.. నిజానికి ఆ డైనోసార్ అంత వేగంగా పరుగెత్తలేదట. అది నడిచే వేగం మహా అయితే గంటకు 4.5 కిలోమీటర్ల వరకే ఉంటుందట. అంటే మనుషులు కాస్త వేగంగా నడవడంతో సమానం అన్న మాటే. ఒకవేళ దానికి మరీ కోపం వచ్చి మన వెంట పడినా గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు అంతకన్నా వేగంగా పరుగెత్తగలరని అంటున్నారు.
డైనోసార్ అస్థి పంజరంపై పరిశోధనతో
అమెరికాలోని మోంటానా స్టేట్‌లో 2013లో ఒక డైనోసార్ పూర్తి శిలాజాన్ని గుర్తించారు. 13 మీటర్ల పొడవు, సుమారు 6 టన్నుల బరువైన ఆ ఆడ టి–రెక్స్ అస్థి పంజరంపై నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ డైనోసార్ తోక ఒక్కటే సుమారు వెయ్యి కిలోల బరువు ఉండి ఉంటుందని, డైనోసార్ నడిచినప్పుడు అది పైకి, కిందికి ఊగుతుందని తేల్చారు. దాని మొత్తం శరీరం, తోక, బరువు ఆధారంగా పరిశీలించి.. టి–రెక్స్ గంటకు 2.8 మైళ్లు (4.5 కిలోమీటర్ల) వేగంతో కదిలేదని నిర్ధారించారు. ఈ లెక్కన మనుషులు కాస్త వేగంగా పరుగెడితే టి–రెక్స్ నుంచి తప్పించుకోవచ్చన్న మాట. అయితే కథ అప్పుడే అయిపోలేదు.
తోడేళ్లలా.. గుంపుగా..
టి–రెక్స్ మెల్లగా కదిలినా దాని నుంచి తప్పించుకోవడం కష్టమేనట. టి–రెక్స్‌లు మనం ఊహించినదాని కంటే మరింత ప్రమాదకరమైనవని.. అవి తోడేళ్లలాగా గుంపులుగా మాటేసి, వేటాడేవని అమెరికాలోని సదరన్ ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2014లో అమెరికాలో ఒకే చోట పెద్ద సంఖ్యలో డైనోసార్ల శిలాజాలను కనుగొన్నారు. దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. అక్కడ డైనోసార్లతోపాటు తాబేళ్లు, మొసళ్లు, చేపల శిలాజాలను కూడా గుర్తించారు. డైనోసార్లు గుంపులుగా వేటాడి, ఆహారాన్ని పంచుకు తినేవని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment