![Dog Bite On Six Years Old Girl At USA - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/1/dog.jpg.webp?itok=qyzJ6XTe)
వాషింగ్టన్: స్నేహితురాలితో ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై శునకం దాడిచేసింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బతికించడానికి వెయ్యికిపైగా కుట్లు వేయాల్సి వచ్చింది. చికిత్స కోసం నిధులు సేకరించారు. హృదయవిదారకమైన ఈ ఉదంతం అమెరికాలోని చెస్టర్‌విల్లేలో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి లిలీ ఫిబ్రవరి 18న ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లింది.
అక్కడ టేబుల్‌పై కూర్చొని ఉండగా ఆ కుటుంబం పెంచుకుంటున్న పిట్‌బుల్ అనే జాతి శునకం హఠాత్తుగా దాడి చేసింది. ముఖంపై కరిచేసింది. కంటి కింది నుంచి చుబుకం దాకా పంటి గాట్లు దిగాయి. లిలీ మిత్రురాలు వెంటనే గట్టిగా అరవడంతో వంటగదిలో ఉన్న ఆమె తల్లి బయటకు వచ్చింది. కుక్కను ఆమె దూరంగా తరిమేసింది.
లిలీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో బోస్టన్‌లోని మరో హాస్పిటల్‌లో చేర్చారు. చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో లిలీ కుటుంబ మిత్రుడొకరు సోషల్ మీడియాలో ‘గోఫండ్‌మీ’ పేరిట పేజీని ఏర్పాటు చేసి, నిధులు సేకరించాడు. వైద్యులు లిలీకి చికిత్స పూర్తిచేశారు.
ముఖంపై వెయ్యికిపైగా కుట్లు వేశారు. తన బిడ్డ దుస్థితిని చూసి శోకాన్ని ఆపుకోవడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని లిలీ తల్లి డోరోతీ నార్టన్ చెప్పారు. లిలీ ముఖంలో కండరాలన్నీ దెబ్బతిన్నాయని, ఇప్పట్లో మాట్లాడలేదని, కనీసం నవ్వలేదని డాక్టర్లు వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment