
కానీ కాలాతీతమైంది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాచాలత
జిన్‌పింగ్, పుతిన్‌తో మోదీ భేటీ తర్వాత పోస్టులు
వాటిని షేర్ చేసిన ఉపాధ్యక్షుడు వాన్స్
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు.
భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్‌తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది.
మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్‌సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్‌కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్‌కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది.
కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్‌పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే.