అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసులు నమోదైన నేపథ్యంలో ట్రంప్ పోలీసులకు సరెండర్ అయ్యారు.
ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్న నేపథ్యంలో స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. నిబంధనల ప్రకారం పోలీసులు ట్రంప్‌ను అరెస్ట చేసి జైలులోకి తీసుకెళ్లారు. ట్రంప్‌కు జైలు అధికారులు P01135809, ఖైదీ నెంబర్ కేటాయిచారు. పోలీసు రికార్డుల కోసం కెమెరా ముందు ఆయన ఫొటోను (మగ్‌షాట్) కూడా తీశారు. ఫుల్టన్ కౌంటీ రికార్డుల ప్రకారం ట్రంప్ ఎత్తు 6.3 అడుగులు. 97 కిలోల బరువు ఉన్నారు. ఆయనకు నీలి కళ్లు, స్ట్రాబెర్రీ రంగు హెయిర్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు.
అయితే 2లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను(భారత కరెన్సీ ప్రకారం రూ.1.65 కోట్లు) సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. ఆ వెంటనే బెయిల్ రావడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ఆయన జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు.
చదవండి: ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా ఆ దేశంలో దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. ఇక అమెరికా చరిత్రలోనే ఫొటోతో సహా(మగ్‌షాట్) పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఆయనపై ఇప్పటి వరకు నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
https://t.co/MlIKklPSJT pic.twitter.com/Mcbf2xozsY
— Donald J. Trump (@realDonaldTrump) August 25, 2023
కాగా తన మగ్ షాట్ ఫోటోను ట్రంంట్ ట్విటరల్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.అయితే 2021 జనవరి 6వ తేదీన ట్రంప్‌ను ట్విటర్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ యాజమాన్య పగ్గాలు ఎలాన్ మస్క్ తీసుకున్నా గత నవంబర్‌లో ట్రంప్‌పై బ్యాన్ తొలగించారు. కానీ ట్రంప్ ట్విటర్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. నేడు అరెస్టు తర్వాత తొలిసారి తన ఖాతాలో మగ్‌షాట్‌ను పోస్టు చేశారు.. ‘ఎన్నికల్లో జోక్యం.. ఎప్పుడూ లొంగను..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్‌ను కేవలం 2గంటల్లో 4.2 కోట్ల మంది వీక్షించారు. రెండు లక్షల సార్లు రీట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment